Begin typing your search above and press return to search.

ఈసారి ధరణికోట నుంచి ఎర్రకోట వరకు!

By:  Tupaki Desk   |   14 Dec 2022 4:20 AM GMT
ఈసారి ధరణికోట నుంచి ఎర్రకోట వరకు!
X
ఆంధ్రప్రదేశ్‌ లో మూడు రాజధానులను నిరసిస్తూ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి రాజధాని రైతులు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రైతులు.. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' వరకు పేరుతో పాదయాత్ర చేశారు. అలాగే 'అమరావతి నుంచి అరసవల్లి' వరకు పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వరకు యాత్ర సాగింది. అయితే.. అడుగడుగునా వైసీపీ నేతలు అడ్డుకోవడంతో పాదయాత్ర నిలిచిపోయింది. పోలీసులు సైతం పాదయాత్ర చేసే రైతులందరికీ గుర్తింపు కార్డులు ఉండాలని.. గుర్తింపు కార్డులు లేకపోతే పాదయాత్రకు అంగీకరించబోమని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తమ యాత్రను తాత్కాలికంగా ఆపేసిన అమరావతి రైతులు ఈసారి తమ యాత్రను 'ధరణికోట నుంచి ఎర్రకోట వరకు' పేరుతో చేయనున్నారు. అమరావతి ఒకప్పటి పేరే ధరణికోట. దీన్ని ధాన్యకటకం అని కూడా పిలిచేవారు. ఇక ఎర్రకోట ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరణికోట నుంచి ఎర్రకోట వరకు అనే నినాదంతో ఈసారి అమరావతి రైతులు యాత్ర చేయనున్నారు. ఈ మేరకు యాత్ర షెడ్యూల్‌ ను అమరావతి రైతు పరిరక్షణ సమితి విడుదల చేసింది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుని డిసెంబర్‌ 17 నాటికి మూడేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ధరణికోట నుంచి ఎర్రకోట వరకు పేరుతో ఢిల్లీ వెళ్లి నిరసన తెలుపుతామని రైతులు చెబుతున్నారు.

డిసెంబర్‌ 15న 1800 మంది రైతులు ప్రత్యేక రైలులో విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. అమరావతికి భూములిచ్చిన రైతులు, కూలీలతో డిసెంబర్‌ 17న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహిస్తామని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ ఆరె శివారెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్‌ ప్రభుత్వాన్ని ఢిల్లీ వేదికగా నిలదీస్తామని ఆయన చెబుతున్నారు. జగన్‌ ప్రభుత్వానికి తోడ్పాటునిస్తున్న కేంద్రానికి కూడా తమ ఆవేదనను తెలుపుతామన్నారు.

అలాగే డిసెంబర్‌ 18న రైతులంతా బృందాలుగా విడిపోయి ఢిల్లీలో వివిధ పార్టీల అధినేతలు, ఎంపీలను కలసి అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తారమన్నారు. అలాగే డిసెంబర్‌ 19న రామ్‌లీలా మైదానంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు. అదేరోజు రాత్రి ఢిల్లీ నుంచి రైలులో తిరిగి వస్తామని చెప్పారు.

అమరావతిలో నిర్మాణ పనులపై హైకోర్టు విధించిన కాలపరిమితిపైనే సుప్రీంకోర్టు స్టే విధించిందని, ఇతర అంశాలపై కాదని శివారెడ్డి గుర్తు చేశారు. అయినా మంత్రులు, ఎమ్మెల్యేలు త్వరలో విశాఖపట్నం వెళ్తామంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జగన్‌ సోదరి షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తే ఆమెకు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి మాట్లాడారని శివారెడ్డి గుర్తు చేశారు. మరి రాజధానికి 35 వేల ఎకరాలిచ్చిన తాము అన్యాయానికి గురై రోడ్డున పడితే తాము ప్రధానికి గుర్తుకు రాలేదా అని నిలదీశారు.

స్వయంగా ప్రధానే అమరావతికి భూమిపూజ చేశారని శివారెడ్డి గుర్తు చేశారు. ఈ మూడు ముక్కలాటను పార్లమెంటులో ఆపకపోతే దేశం ఐదు ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.