Begin typing your search above and press return to search.

ఈసారి అఫీషియల్.. టీడీపీకీ దివ్యవాణి రాజీనామా

By:  Tupaki Desk   |   2 Jun 2022 5:28 AM GMT
ఈసారి అఫీషియల్.. టీడీపీకీ దివ్యవాణి రాజీనామా
X
ప్రముఖ సినీ నటి దివ్యవాణి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. దీనిపై అధికారికంగా ఆమె ఒక వీడియో విడుదల చేశారు. రెండు రోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని దివ్యవాణి కలిసిన సంగతి తెలిసిందే. తాను పార్టీలోనే కొనసాగుతా అని ఈ సందర్భంగా ఆమె చెప్పిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుని కలసి రెండు రోజులు గడవక ముందే మళ్ళీ రాజీనామా బాట పట్టారు.

టీడీపీలో ఇప్పుడు దివ్యవాణి రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల క్రితం తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ట్వీట్ చేసిన దివ్యవాణి ఆ వెంటనే దాన్ని డిలీట్ చేశారు. తాను టీడీపీ వీడటం లేదని.. అంతకు ముందు తనను సస్పెండ్‌ చేసినట్లు ఫేస్ బుక్ లో వచ్చిన ఒక నకిలీ పోస్టు చూసి పొరపడి ట్వీట్‌ పెట్టానని దివ్యవాణి తెలిపారు.

''తొలుత తాను పెట్టిన ట్వీట్ లో తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను.. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను'' అని ట్విట్టర్‌లో ఆమె పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత టీడీపీ పెద్దల జోక్యంతో తాను టీడీపీలోనే కొనసాగుతున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం (జూన్ 1న) టీడీపీ అధినేత చంద్రబాబును పార్టీ కార్యాలయంలో దివ్య వాణి కలిశారు. ఆ తర్వాత మీడియాతోనూ సంతోషంగా మాట్లాడారు. ఆ సమయంలోనే చంద్రబాబు చాలా మర్యాద ఇచ్చారని తెలిపారు. ట్వీట్ ను డిలీట్ చేయటం.. చంద్రబాబును కలవటంతో ఇక దివ్యవాణి టీడీపీలోనే కొనసాగుతారని..ఈ వివాదం ముగిసినట్లేనని అందరూ భావించారు.

అయితే దివ్య వాణి వెంటనే ఒక వీడియో సందేశం విడుదల చేశారు. అందులో తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు పార్టీలో చాలా మర్యాద ఇచ్చారంటూ మరోసారి వ్యంగంగా వ్యాఖ్యానించారు. అన్ని విషయాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తానని ఆ వీడియోలో తెలిపారు.

అయితే, దివ్య వాణి పార్టీలో పరిస్థితుల గురించి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపైన టీడిపీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉందనే ప్రచారం సాగుతోంది. అందుకే దివ్య వాణి రాజీనామా చేశారని అంటున్నారు.