Begin typing your search above and press return to search.

తుమ్మలకు మంత్రి పదవి లేదు..

By:  Tupaki Desk   |   14 Dec 2018 1:30 AM GMT
తుమ్మలకు మంత్రి పదవి లేదు..
X
తుమ్మల నాగేశ్వరరావు. సీనియర్ రాజకీయ నాయకుడు. ఖమ్మం జిల్లా రాజకీయాలను కొన్నాళ్ల పాటు ప్రభావితం చేసిన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో ఉండగా మంత్రిగా - శాసనసభ్యుడి పని చేసిన నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అత్యంత ఆప్త మిత్రుడిగా తుమ్మల నాగేశ్వరరావుకు పేరుంది. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేకపోయినా కేవలం తన స్నేహితుడు అయినందున తమ్మల నాగేశ్వరరావును తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకుని శాసనమండలి సభ్యుడ్ని చేశారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. అంతే కాదు తన క్యాబినెట్ లో మంత్రి పదవి కూడా కట్టపెట్టారు. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన తుమ్మల ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ తర్వాత 2016 సంవత్సరంలో జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మలకు టిక్కట్ ఇచ్చి దగ్గరుండి గెలిపించుకుని ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్లు - భవనాల శాఖకు మంత్రిని చేశారు. ఆ తర్వాత తాజా ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు మరోసారి పాలేరనుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలిచారు.

ఈసారి ఆయన విజయం సాధించడం ఖాయమని - ఆ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన అనుచరులు ఆశించారు. అయితే తుమ్మల నాగేశ్వర రావు కలలు కల్లలయ్యాయి. పాలేరులో ఆయన కాంగ్రెప్ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు. దీనికి కారణం సొంత పార్టీ వారే అని నిర్ధారణకు వచ్చారు. తన స్నేహితుడు ఓటమి పాలు కావడం కె.చంద్రశేఖర రావును కూడా బాధించింది. దీంతో కేసీఆర్ నేరుగా తుమ్మలకు ఫొన్ చేసి హుటాహుటిన హైదరాబాద్ రావాలని ఆదేశించారు. ఈ పిలుపుతో తుమ్మల అనుచరుల్లో ఆనందం వెల్లివిరిసింది. మళ్లీ మరోసారి ఎమ్మెల్సీగా తుమ్మలకు అవకాశం ఇచ్చి మంత్రి పదవి కట్టబెడతారని వారంతా సంబురాలు చేసుకున్నారు. అయితే తుమ్మలకు ఎలాంటి పదవి ఇస్తారో తెలియదు కాని... మంత్రిగా మాత్రం తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. "ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం లేదు. ఎందుకంటే వారికి ఇస్తే విజయం సాధించిన శాసనసభ్యులు కోపగిప్తారు. ఇది తప్పు కూడా " అని కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ ప్రకటనతో తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రపదవి రాదని తేలిపోయింది. తుమ్మలను హైదరాబాద్ పిలిపించుకుని సముదాయించిన తర్వాత పార్టీలో పెద్ద పదవే ఇస్తారని అంటున్నారు.