Begin typing your search above and press return to search.

ఒత్తిడితో బ్యాంకు అధికారులు చనిపోయారట

By:  Tupaki Desk   |   22 Nov 2016 4:01 AM GMT
ఒత్తిడితో బ్యాంకు అధికారులు చనిపోయారట
X
ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో జరిగే లాభం ఏమిటన్న విషయంపై అందరికి అవగాహన ఉన్నా.. దాన్ని సమర్థవంతంగా అమలు చేసే విషయంలో అధికారులు చేస్తున్న తప్పులు.. పలువురి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నోట్ల రద్దు నేపథ్యంలో నగదు లభ్యత విషయంలో ఏర్పడిన కొరత కారణంగా.. విత్ డ్రా కోసం.. నగదు మార్పిడి కోసం క్యూ లైన్లలో గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన దుస్థితి.

బ్యాంకుల వద్ద క్యూలో నిలుచొని తీవ్ర అస్వస్థతకు గురై మరణించిన ఉదంతాలు ఇప్పటికి చాలానే విన్నాం. ఈ ఘటనలపై విపక్షాలు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించటమేకాదు.. నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఇదిలా ఉంటే.. క్యూలో నిలుచొని అస్వస్థతతో ప్రాణలు విడిచిన సామాన్యులతో పాటు.. రద్దు కారణంగా పెరిగిన పని ఒత్తిడి నేపథ్యంలో అనారోగ్యానికి గురై బ్యాంకు అధికారులు పెద్ద ఎత్తున మరణిస్తున్నకొత్తకోణం బయటకు వచ్చింది. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన 12 రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 11 మంది బ్యాంకు సిబ్బంది మరణించినట్లుగా తేల్చారు. ఈ విషయానని బ్యాంకు అధికారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ థామస్ ఫ్రాంకో వెల్లడించారు. ఒక ఆంగ్ల పత్రికతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఆసక్తికరఅంశాల్ని తెర మీదకు తీసుకురావటంతో పాటు.. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న వేళ ఆర్ బీఐ గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఉర్జిత పటేల్ తప్పుల మీద తప్పులు చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన పలు విషయాల్ని చూస్తే.. నోట్ల రద్దు విషయంలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్ చేసిన తప్పులు ఇట్టే అర్థమైపోవటం ఖాయమని చెప్పొచ్చు.

నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేసేందుకు సరైన రోడ్ మ్యాప్ లేదని విమర్శించిన ఫ్రాంకో.. గతాన్ని గుర్తు చేశారు. 1978లో అప్పటి మోరార్జీ దేశాయ్ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సందర్భంగా నాటి ఆర్ బీఐ గవర్నర్ ఐజీ పటేల్.. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. ప్రధాని మోడీకానీ.. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కానీ ఆర్థికవేత్తలు కారని.. ఒక ఆర్థికవేత్తగా ఉన్న ఉర్జిత పటేల్ నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా తప్పు చేశారన్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన తీవ్ర గందరగోళానికి.. సామాన్య ప్రజల మరణాలకు నోట్ల రద్దు నిర్ణయం ఒక కారణంగా తేల్చారు.

రద్దు నిర్ణయం నేపథ్యంలో తెర మీదకు తీసుకొచ్చిన రూ.2వేల నోటుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. ఫ్రాంకో సైతం రూ.2వేల నోటుపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో రూ.500.. రూ.100 నోట్లు ఎక్కువగా చెలామణీ అవుతాయని.. అయినా రూ.2వేల నోటు తీసుకొచ్చే ఆలోచన ఉంటే.. వాటిని పెద్ద ఎత్తున ముద్రించాల్సిన అవసరం ఉందని.. కానీ ఆ పని చేయలేదని తప్పు పట్టారు. ఏటీఎంలను రూ.2వేల నోట్లకు సరిపోయేలా సాంకేతికతను మార్చలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకున్న ఇన్ని రోజులకూ రూ.500 నోట్లను పెద్ద ఎత్తున ఎందుకు విడుదల చేయటం లేదో అర్థం కావటం లేదని విస్మయాన్ని ఫ్రాంకో వ్యక్తం చేశారు. పెద్దనోట్లను రద్దు చేసిన ఇన్ని రోజుల తర్వాత కూడా రూ.500నోట్లు ఇంకా బ్యాంకులకు చేరకపోవటం ఏమిటి? వెయ్యి నోటుతో రూ.2వేల నోటు చిన్న సైజులో ముద్రించినప్పుడు ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న 2.5లక్షల ఏటీఎంలను మార్చాలన్న విషయం ఎందుకు తట్టలేదన్న ప్రశ్నను సంధిస్తున్నారు. నోట్ల రద్దుతో చోటు చేసుకున్న పరిణామాల్ని సరిదిద్దటానికి.. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయటానికి 12 నెలల నుంచి కనీసం 15 నెలల వరకూ పట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/