Begin typing your search above and press return to search.

తెలంగాణ రియల్ రంగాన్ని శాసిస్తున్న ఆ 2 జిల్లాలు

By:  Tupaki Desk   |   13 April 2021 2:30 PM GMT
తెలంగాణ రియల్ రంగాన్ని శాసిస్తున్న ఆ 2 జిల్లాలు
X
కరోనా మహమ్మారి కారణంగా దేశీయ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటివేళ.. తెలంగాణ మాత్రం త్వరగా తేరుకోవటమే కాదు.. భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. పక్కనే ఉన్న ఏపీ ఇప్పటివరకు కోలుకున్నది లేదు. మరోసారి కొత్త కేసులు విరుచుకుపడుతున్ననేపథ్యంలో.. రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రానికి రెండు జిల్లాలు కీలకంగా మారటమే కాదు.. రాష్ట్ర ఆదాయ వనరుకు గుండెకాయలా మారాయి.

కరోనా లాంటి గడ్డు పరిస్థితుల్లోనూ రియల్ రంగం మాంచి ఊపులో ఉందంటే కారణం.. హైదరాబాద్ జిల్లాను అనుకొని ఉండే రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాల పుణ్యమేనని చెప్పాలి. మహనగరానికి శివారులో ఉండే ఈ రెండు జిల్లాల తెలంగాణ ఆర్థిక రంగానికి కీలకంగా మారాయి. కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా రియల్ రంగం కుదేలైంది. అందుకు భిన్నంగా రంగారెడ్డి.. మేడ్చల్ రెండు జిల్లాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు కావటమే కాదు..కొత్త రికార్డుల దిశగా దూసుకెళుతోంది.

గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.4వేలకోట్లకు పైగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తే.. అందులో రూ.2503 కోట్లు కేవలం రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాల ద్వారా రావటం గమనార్హం. అంతేకాదు.. ఈ రెండు జిల్లాల్లో ఏడాది మొత్తం జరిగిన లావాదేవీల్లో చివరి మూడు నెలలు చాలా కీలకంగా సాగిందని చెప్పాలి. రంగారెడ్డి జిల్లాలో ఏడాదిలో1.7లక్షల లావాదేవీలు జరిగితే.. చివరి మూడు నెలల్లోనే 88వేలకు పైగా లావాదేవీలు సాగాయి.

అదే విధంగా మేడ్చల్ జిల్లాలో ఏడాదిలో లక్షకు పైగా డాక్యుమెంట్లు నమోదైతే.. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో 58వేలకు పైగా రిజిస్ట్రేషన్లుజరటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. తెలంగాణ రియల్ రంగానికి ఈ రెండు జిల్లాలు కీలక ఆదాయవనరుగా మారాయని చెప్పక తప్పదు.