Begin typing your search above and press return to search.

సంచలనం; మాజీ జడ్జి నోట నేతల చావు మాట

By:  Tupaki Desk   |   26 Feb 2016 9:39 AM GMT
సంచలనం; మాజీ జడ్జి నోట నేతల చావు మాట
X
దేశవ్యాప్తంగా భారీ చర్చకు కారణమైన ఢిల్లీ జేఎన్ యూ వివాదం మరింత ముదురుతోంది. ఉగ్రవాది అప్ఝల్ గురు ఉరిశిక్షను ఖండించటం.. అతడి సంస్మరణ సభను కొందరు నిర్వహించటం.. ఆ సందర్భంగా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు వ్యక్తం కావటం.. అలా చేశారన్న ఆరోపణలున్న విద్యార్థులపై దేశ ద్రోహం కేసులు పెట్టి అరెస్ట్ చేయటం లాంటి పరిణామాలు జరిగిపోయాయి. దీనిపై కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ లు తీవ్రంగా వ్యతిరేకించాయి. తాజాగా జేఎన్ యూ వ్యవహారంపై పార్లమెంటులో వాడీ వేడి చర్చలు సాగుతున్నవేళ.. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంటు మీద దాడి కేసులో అఫ్జల్ పై విచారణ సాగి.. దోషిగా తేలటంతో ఉరిశిక్ష విధించారు జస్టిస్ థింగ్రా. తాజాగా జేఎన్ యూ ఇష్యూ నేపథ్యంలో ఆయన్ను ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఫ్జల్ గురును మద్దుతు పలికే నేతలు.. ఆ రోజు ఉగ్రవాదులు కానీ పార్లమెంటులో ప్రవేశించి ఉండి ఉంటే ఇప్పటికే మరణించి ఉండేవారు కదా అని వ్యాఖ్యానించారు. అఫ్జల్ కు మద్దతు పలికే వారు నాటి దాడిలో పార్లమెంటులోకి ప్రవేశించి ఉంటే హతమయ్యేవారన్న అర్థంలో మాట్లాడిన ఆయన.. 15 మంది అమాయకుల మరణానికి కారణమైన అఫ్జల్ కు సంస్మరణ సభ నిర్వహించాలా? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అఫ్జల్ కు అమలైన ఉరిశిక్షను జ్యూడీషియల్ కిల్లింగ్ గా అభివర్ణిస్తున్న కొందరిని తీవ్రంగా తప్పు పట్టిన థింగ్రా.. సమాజానికి హాని చేసే వారికి ఉరిశిక్ష అమలు చేసే హక్కు న్యాయమూర్తులకు రాజ్యాంగం ఇచ్చిందన్న వాస్తవాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించారు. జేఎన్ యూ వ్యవహారంలో అఫ్జల్ గురు సంస్మరణ సభను నిర్వహించిన అంశంపై మాజీ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చలకు తావిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.