Begin typing your search above and press return to search.

ఆ కాంగ్రెస్ ఎంపీలు.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో!

By:  Tupaki Desk   |   2 Feb 2022 4:30 PM GMT
ఆ కాంగ్రెస్ ఎంపీలు.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో!
X
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు త్రిముఖ పోరు నెల‌కొంది. బీజేపీ, కాంగ్రెస్ పుంజుకోవ‌డంతో అధికార టీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పి త‌ప్ప‌డం లేదు. వ‌చ్చే ఏడాదే తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టినుంచే ఈ పార్టీలు అధికారం సాధించ‌డం కోసం ప్ర‌ణాళిక‌ల్లో త‌ల‌మున‌క‌ల‌య్యాయి. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల బ‌లం, నాయ‌కుల ఛ‌రిష్మా, సామాజిక ప‌రిణామాలు.. ఇలా అన్ని అంశాల‌పై దృష్టి సారిస్తున్నారు. దీంతో పాటు పార్టీలోని కీల‌క నాయ‌కులు పోటీ చేసే స్థానాల‌పై కూడా ఓ అంచ‌నాకు వ‌స్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎంపీలు వ‌చ్చే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పోటీకి సై అంటున్నారు. వాళ్లే రేవంత్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి.

రాష్ట్రంలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ ఎంపీగా గెలిచిన రేవంత్ ఇప్పుడు తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. త‌న దూకుడైన వ్య‌క్తిత్వంతో కేసీఆర్‌కు స‌వాలు విసురుతున్నారు. పార్టీ శ్రేణుల్లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న కొడంగ‌ల్ నుంచి మ‌రోసారి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయ‌న ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సారి అక్క‌డి ప్ర‌జ‌లు త‌న‌ను ఆద‌రిస్తార‌ని, ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆయ‌న గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రోసారి కీల‌క పాత్ర పోషించాల‌ని భావిస్తున్నారు. ఆయ‌న కూడా ఈ సారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారని తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో హుజూర్‌న‌గ‌ర్ నుంచి మ‌రోసారి పోటీ చేస్తార‌ని స‌మాచారం. అందుకే త‌ర‌చుగా హుజూర్‌న‌గ‌ర్‌, కోదాడ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో ఆయ‌న జూమ్ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న స‌తీమ‌ణ ప‌ద్మావ‌తికి ఈ సారి కోదాడ టికెట్ ఇవ్వ‌క‌పోయినా తాను మాత్రం క‌చ్చితంగా హుజూర్‌న‌గ‌ర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

పార్టీలో త‌న‌దైన వైఖ‌రితో ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచే ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి కూడా మ‌రోసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న‌కు రాష్ట్ర రాజ‌కీయాలంటేనే మ‌క్కువ ఎక్కువ‌నే సంగ‌తి తెలిసిందే. ఈ సారి న‌ల్గొండ‌లో త‌న విజ‌యం గ్యారెంటీ అనే న‌మ్మ‌కంతో ఆయ‌న ఉన్న‌ట్లు స‌మాచారం. అందుకే ఎక్కువ‌గా న‌ల్గొండ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ అక్క‌డి క్యాడ‌ర్‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. అయితే ఒక‌వేళ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ముగ్గురు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ ప‌డుతున్నార‌నే వ్యాఖ్య‌లూ వినిపిస్తున్నాయి. మ‌రి వీళ్ల విష‌యంలో హైక‌మాండ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.