Begin typing your search above and press return to search.

అవును.. 11 రోజులుగా ఆ నలుగురు ప్రగతిభవన్ లోనే.. ఎప్పుడు బయటకు?

By:  Tupaki Desk   |   6 Nov 2022 3:53 AM GMT
అవును.. 11 రోజులుగా ఆ నలుగురు ప్రగతిభవన్ లోనే.. ఎప్పుడు బయటకు?
X
రూ.50 కోట్లు ఎర వేసి తమ ఎమ్మెల్యేల్ని తన్నుకుపోవాలని బీజేపీ ముఖ్యనేతలు మధ్యవర్తిత్వం నడిపారంటూ సంచలన ఆరోపణలు చేయటమే కాదు.. దానికి సంబంధించిన ఆడియో.. వీడియో ఫుటేజ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విడుదల చేయటం.. ఈ అంశంపై దేశంలోని రాజకీయ పార్టీలు.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. రాష్ట్రాల హైకోర్టులు.. సుప్రీంకోర్టు ఫోకస్ చేయాలని.. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకొని న్యాయం చేశాయని వ్యాఖ్యానించటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ ఇష్యూకు సంబంధించి కీలకమైన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కడ? అన్నది ప్రశ్నగా మారింది.

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీజేపీకి చెందిన మధ్యవర్తులుగా చెబుతున్న ముగ్గురు తమకు ఎర వేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటం.. నానా హంగామా జరగటం తెలిసిందే. అలా జరిగిన తర్వాత.. పోలీసులు ఎంట్రీ ఇవ్వటం.. ఈ నలుగురు ఎమ్మెల్యేల్ని ప్రత్యేక వాహనంలో ప్రగతిభవన్ కు వెళ్లటం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవటం తెలిసిందే. ఆ రోజు మొదలు కొని ఈ రోజు వరకు అంటే దాదాపు పదకొండు రోజుల నుంచి ఎర వేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ లోనే ఉంటున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే సంచలన ప్రెస్ మీట్ పెట్టటం.. ఆ సందర్భంగా ఎర వేసినట్లుగా చెబుతున్న నలుగురు ఎమ్మెల్యేల్ని తన పక్కన కూర్చొబెట్టుకొని మరీ సీసీ కెమేరా ఫుటేజ్ ను విడుదల చేయటం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్స్ తో పాటు 4 + 4 గన్‌‌‌‌మన్‌‌‌‌లను ఇస్తున్న ఉత్తర్వుల్ని జారీ చేశారు.

ఈ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ లో హైసెక్యూరిటీ జోన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రగతిభవన్ బయటకు కాలు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. భారీ భద్రతతో పాటు బుల్లెట్ ఫ్రూవ్ వెహికిల్స్ ను ఏర్పాటు చేసినా.. ఈ నలుగురు ఎమ్మెల్యేల్ని మాత్రం ప్రగతిభవన్ నుంచి బయటకు మాత్రం పంపకపోవటం గమనార్హం. నిజానికి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతను అప్పజెప్పారు. పైలెట్ రోహిత్ రెడ్డికి తాండూరు.. రేగా కాంతారావుకు పినపాక.. బీరం హర్షవర్ధన్ రెడ్డికి కొల్లాపూర్.. గువ్వల బాలరాజుకు అచ్చంపేట బాధ్యతల్ని అప్పజెప్పారు.

అయినప్పటికీ ఈ నలుగురు మాత్రం పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కు రావటం.. ఇద్దరు స్వామిజీలతో పాటు నందూ అనే మరో వ్యాపారితో కలిసి డీల్ మాట్లాడుకోవటం.. చివర్లో పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు ఎంట్రీ ఇవ్వటంతో మునుగోడు ఉప ఎన్నికకు మించిన సంచలన ఎపిసోడ్ మొదలైందని చెప్పాలి. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. ఎర వేసిన నలుగురు ఎమ్మెల్యేల్ని ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతిభవన్ లోనే ఉంచుకోవటం.. వారిని బయటకు రానివ్వకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన విషయాల్ని ప్రధాన మీడియా సంస్థలు ఏమీ పట్టించుకోనట్లుగా ఉండటం మరో విశేషం.