Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు ఆ ముగ్గురున్నా.. జింఖానా రచ్చను తప్పించలేకపోయారే?

By:  Tupaki Desk   |   23 Sep 2022 8:08 AM GMT
హైదరాబాద్ కు ఆ ముగ్గురున్నా.. జింఖానా రచ్చను తప్పించలేకపోయారే?
X
అభిమానం మరో లెవల్ కు వెళితే.. ఎలా ఉంటుందో హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ ను చూస్తే అర్థమైంది. క్రికెట్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడటం కోసం డబ్బులు పెట్టి మరీ టికెట్ కొనటం కోసం అభిమానులు పరుగులు తీసిన వైనం.. వారిని నిలువరించేందుకు గొడ్లను బాదినట్లుగా పోలీసులు లాఠీలు విదల్చటం చూసినప్పుడు.. క్రికెట్ ను ఎంత ప్రేమిస్తే మాత్రం అన్నేసి దెబ్బలు తినాలా? అని అనుకోకుండా ఉండలేం.

నిజానికి భారీ జనసందోహాన్ని నిలువరించటానికి లాఠీల్ని విదల్చటమే పనా? వేరే మార్గం లేదా? అన్నది ఒక ప్రశ్న. ఆ విషయాన్ని పక్కన పెడితే.. పోలీసులు లాఠీలకు పని చెప్పే వరకు విషయాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? మ్యాచ్ టికెట్ కోసం ప్రాణాల్ని పణం పెట్టేంత డేంజర్ గేమ్ ఏంటి? అన్నది కూడా ప్రశ్నే. ఇలాంటి ప్రశ్నల నడుమ.. క్రికెట్ ను అభిమానులు ఎంతలా ప్రేమిస్తారో.. అంతేలా ప్రేమించే మరో ముగ్గురు ముఖ్యులు హైదరాబాద్ లో జరిగే క్రికెట్ మ్యాచ్ ను సాఫీగా నడిపించే కీలక స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఇప్పుడున్న అసలు ప్రశ్న.

తెలంగాణ రాష్ట్ర క్రీడా మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ గౌడ్ సంగతే తీసుకుంటే.. క్రికెట్ ను అభిమానించి.. ప్రేమించే విషయంలో ఆయన కూడా ముందుంటారు. అలాంటి వ్యక్తి మంత్రిగా ఉన్నారు. మూడేళ్ల తర్వాత హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తున్న టీ 20 మ్యాచ్ ను మరింత పకడ్బందీగా జరిగేలా.. ఇబ్బందులు లేకుండా చూసుకునే వీలుంది. అవసరమైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను సైతం కంట్రోల్ చేసే అధికారం ఆయనకు ఉంది.

ఇక.. మహ్మద్ అజారుద్దీన్. టీమిండియాకు ఒకప్పుడు కెప్టెన్ గా వ్యవహరించిన ఆయన.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. తన సొంత నగరంలో టీమిండియా మ్యాచ్ జరుగుతున్న వేళ.. దాన్ని సాఫీగా జరిగేలా చేయటం ఆయన చేతుల్లో ఉంది. ఇక.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా సీవీ ఆనంద్ ఉన్నారు. విధుల పట్ల ఆయన ఎంత కమిట్ మెంట్ తో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడా రాజీ పడని ధోరణి ఆయన సొంతం.

దీనికి తోడు వ్యక్తిగతంగా ఆయన క్రికెట్ అభిమాని.ఆయన కుమారుడు అండర్ 19 క్రికెట్ టీంలో ఆటగాడు కూడా. అలాంటి ఆయన ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే నిన్నటి జింఖానా గ్రౌండ్స్ ఉంది.ఇలా ముఖ్యులైన ముగ్గురు.. క్రికెట్ ను అభిమానించి.. ఆరాధించేవారే. అలాంటి వారున్నా కూడా సగటు క్రికెట్ అభిమానికి మాత్రం టికెట్ల కోసం ప్రయత్నించిన వేళ లాఠీ దెబ్బలు తప్పలేదు.

ఇదంతా చూసినప్పుడు ముగ్గురు ముఖ్యులు ఉండి కూడా మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు దారుణ పరిస్థితుల్ని ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదన్న భావన కలుగక మానదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.