Begin typing your search above and press return to search.

మేయర్ రేసులో ఆ ముగ్గురు మహిళామణులు

By:  Tupaki Desk   |   4 Feb 2021 1:30 PM GMT
మేయర్ రేసులో ఆ ముగ్గురు మహిళామణులు
X
జీహెచ్ ఎం సీ కౌన్సిల్ సమావేశానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. గంటకో పేరు బయటకి వస్తుంది. ఫిబ్రవరి 11న కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది. అలాగే , అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం జీహెచ్ ఎం సీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో టీఆర్ ఎస్ కార్పొరేటర్లలో మేయర్, డిప్యూటీ మేయర్‌ కుర్చీల కోసం పలువురు నేతలు కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ సారి మేయర్ సీటును జనరల్ మహిళకు కేటాయించారు.

జీహెచ్ ఎం సీ ఫలితాలు రాగానే మేయర్ రేసులో భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శరెడ్డి పేరు బాగా ఎక్కువగా వినిపించింది. ప్రస్తుతం ఆమె రేసులో వెనుకబడిపోయింది అనే వార్తలు వస్తున్నాయి. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి మేయర్ కాబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది. ఆమె కోసం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధిష్టానంతో రాయబారం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి తన తండ్రి కేశవరావు ద్వారా మేయర్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

బంజారాహిల్స్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ఇటీవల కేటీఆర్‌ను కలిశారు. మేయర్‌ గా తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరికి తోచిన రీతిలో వారు మేయర్ కుర్చీకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ప్రస్తుత డిప్యూటీ మేయర్ బాబాను మళ్లీ కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

అల్లాపూర్ కార్పొరేటర్‌ గా గెలిచిన సహిబా బేగం మైనారిటీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కూకట్‌ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పైరవీ చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హోంమంత్రి మహ్మాద్ అలీతోపాటు మరికొందరు మైనారిటీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.