Begin typing your search above and press return to search.

గులాబీ ప్లీనరీ ప్రచారంలో అస్సలు మిస్ కానిది ఆ ఇద్దరే!

By:  Tupaki Desk   |   27 April 2022 12:30 PM GMT
గులాబీ ప్లీనరీ ప్రచారంలో అస్సలు మిస్ కానిది ఆ ఇద్దరే!
X
ఏడాదైంది. మళ్లీ గులాబీ పండుగ వచ్చేసింది. ఏడాది క్రితం ఎలా అయితే పరిమిత ఆహ్వానితుల మధ్య హెచ్ ఐసీసీలో ప్లీనరీవేడుకనునిర్వహించారో.. ఈ ఏడాది అదే రీతిలో నిర్వహిస్తున్నారు.

గత ఏడాది కరోనా కారణంగా పరిమితంగా ప్లీనరీని నిర్వహించటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఈఏడాది సైతం కేవలం 3500 మంది ఆహ్వానితులతో భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక.. పార్టీ వార్షికోత్సవానికి సంబంధించిన ప్రచారాన్ని భారీగా చేపట్టారు. ఇందుకోసం కమిటీలు వేసి.. టార్గెట్లు పెట్టి మరీ నేతల చేత ఖర్చు పెట్టించినట్లుగా చెబుతున్నారు.

దినపత్రికల్లో వచ్చిన జాకెట్ యాడ్లు కావొచ్చు.. హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు.. హోర్డింగ్ లు.. బిల్ బోర్డులు.. ఇలా ఏ ప్రచారంలో అయినా సరే కొందరు కీలక నేతలు మిస్ అయితే.. ఇద్దరు మాత్రం అస్సలు మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వారిలో ఒకరు పార్టీ అధినేత కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే.. రెండోవారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్.

గతంలో ప్లీనరీ కానీపార్టీకి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం ఏదైనా కానీ కేసీఆర్ ఫోటో తప్పనిసరిగా ఉండేది. ఇక.. మిగిలిన వారి విషయానికి వస్తే కేటీఆర్.. కవిత.. హరీశ్ రావు ఫోటోలు ఉండేవి. కొంత కాలం క్రితం రాజ్యసభ సభ్యుడు సంతోష్ హవా మొదలైన నాటి నుంచి ఆయన ఫోటోను చేర్చారు.

ఇటీవల కాలంలో హరీశ్-కవిత-సంతోష్ ఫోటోలు కొన్నిచోట్ల రావటం.. కొన్నిచోట్ల తీసేయటం కనిపిస్తుంది. ఇవాల్టి రోజున టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా వివిధ దినపత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్ని చూసినప్పుడు.. ప్రముఖంగా కేసీఆర్.. కేటీఆర్ తప్పించి కొన్నిచోట్ల మిగిలిన అందరిని ఎత్తేసి.. ఎవరైతే యాడ్ ఇస్తున్నారో.. వారి ఫోటో వేసుకోవటం కనిపిస్తుంది. ఏమైనా.. మారుతున్న కాలానికి తగ్గట్లు.. పార్టీలో మారిన ప్రాధామ్యాన్ని గులాబీ ప్లీనరీ ఇట్టే చెప్పేసిందని చెప్పక తప్పదు.