Begin typing your search above and press return to search.

ఆ రెండు ఎన్నికలు టీడీపీలో గుబులు రేపుతున్నాయా!

By:  Tupaki Desk   |   24 Nov 2022 4:30 PM GMT
ఆ రెండు ఎన్నికలు టీడీపీలో గుబులు రేపుతున్నాయా!
X
త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు, మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో ప్రస్తుతమున్న ఐదుగురు ఎమ్మెల్సీలు మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఐదుగురి స్థానాల్లో మరో ఐదుగురిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో కొత్తవారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే చోట్ల ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించింది. డిసెంబర్‌ 30 వరకు ఈ జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించనుంది.

ఈ నేపథ్యంలో ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకుని తమ సత్తా చాటాలని అధికార వైసీపీ భావిస్తోంది. ఒక రకంగా 2024 అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను సెమీ ఫైనల్‌గా పరిగణిస్తోంది.

అలాగే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని కంకణం కట్టుకున్న టీడీపీ సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

అయితే టీడీపీకి తాజాగా గుబులు పట్టుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు జరుగుతోంది. ఈ క్రమంలో అధికార వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను చేరుస్తున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు కూడా వైసీపీ నేతలు చెప్పినట్టు చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఆ ఓటర్ల వివరాలు పూర్తిగా తెలుసుకోకుండానే ఓటు హక్కును జారీ చేస్తున్నాయని మండిపడుతున్నాయి.

నకలీ ఓటర్లను పెద్ద ఎత్తున చేర్చడం ద్వారా వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటోందని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు వచ్చిన ఎన్నిక ఏదైనా చిన్నపాము అయినా పెద్దకర్రతో కొట్టాలన్నట్టు వైసీపీ వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తమ గెలుపు కోసం సామ దాన దండోపాయాలు ప్రయోగిస్తోంది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచడం ఇవన్నీ మామూలే.

ఈ నేపథ్యంలో వైసీపీ ధాటిని తాము తట్టుకోలేమని టీడీపీ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. రోజూ వందల సంఖ్యలో వైసీపీ నకిలీ ఓటర్లను చేరుస్తుందని టీడీపీ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. అర్హతలు లేకపోయినా వైసీపీ నేతల ఒత్తిడితో అధికారులు ఓటు హక్కు కల్పిస్తున్నారని ధ్వజమెత్తుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.