Begin typing your search above and press return to search.

అమిత్ షా తో ఆ ఇద్దరు ఎంపీలూ...?

By:  Tupaki Desk   |   15 Nov 2021 11:30 AM GMT
అమిత్ షా తో ఆ ఇద్దరు ఎంపీలూ...?
X
ఏపీలో బీజేపీని ఇప్పటికిపుడు లేవదీయాలనుకున్నా కుదిరే కధ కాదు. అది అందరికీ తెలుసు. రెండు దశాబ్దాలుగా బీజేపీకి ఏపీలో మూడు నాలుగు సీట్లు తప్ప అంతకు మించి దక్కింది లేదు. వాజ్ పేయ్ వేవ్, మోడీ వేవ్ ని దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు కూడా సొమ్ము చేసుకుని బాగుపడ్డాయి కానీ ఏపీలో మాత్రం కమలం ఏ పూటా కళ కట్టలేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉన్న రాజకీయాలకు బీజేపీ ఫిలాసఫీకి అసలు కుదరడంలేదు. ఇంకో వైపు చూస్తే పొలిటికల్ స్పేస్ కూడా ఎక్కడా లేని సీన్ ఉంది. ఈ నేపధ్యంలో బీజేపీ ప్రయత్నాలు పూర్తిగా వ్యర్ధం అవుతున్నాయి. మరి ఈ విషయాలూ విశ్లేషణలూ అమిత్ షాకు తెలియనివి కావు.

ఇక ఏపీకి వచ్చిన అమిత్ షా మొదటి రెండు రోజులూ అధికారిక కార్యక్రమాలకు కేటాయించిన మూడవ రోజు మాత్రం బీజేపీ నేతలకు బాగానే టైమ్ ఇచ్చారు. కీలకనేతలతో ఆయన భేటీ అయ్యారు. ఇక ఆయన ప్రత్యేకంగా పిలిపించుకున్న ఆ ఇద్దరు ఎంపీల గురించి బీజేపీలో హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. వారిద్దరూ టీడీపీ మాజీ తమ్ముళ్ళు, చంద్రబాబుకు కుడి ఎడమలుగా మెలిగిన నాయకులు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలో చేరిపోయారు. ఈ ఇద్దరూ అటు నుంచి ఇటు కధను నరుక్కువస్తున్నారని అంటారు. ఇపుడు ఆ ఇద్దరితో అమిత్ షా భేటీ కావడం అంటే రాజకీయంగా విశేషంగానే చూడాలి.

ఈ ఇద్దరూ కూడా ఏపీలో బీజేపీ పరిస్థితితో పాటు జగన్ సర్కార్ ఏపీలో ఏ విధంగా పాలన చేస్తోంది, వైసీపీకి జనాల్లో ఉన్న ప్లస్ మైనస్సులు ఏంటి అన్నవి అమిత్ షాకు పూసగుచ్చినట్లుగా వివరించారని అంటున్నారు. ఏపీలో వైసీపీని ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీద వారు అమిత్ షాకు అన్నీ చెప్పే ఉంటారని అంటున్నారు. ఏపీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉండగా ఈ ఇద్దరినీ స్పెషల్ గా అమిత్ షా పిలిపించుకుని మాట్లాడడం అంటే షా మదిలో ఏదో ఉందనే అంటున్నారు. ఇక అమిత్ షా వచ్చిన దగ్గర నుంచి ఆయనను వెన్నంటి సీఎం రమేష్ ఉండడం కూడా ఈ సందర్భంగా గమనార్హం. ప్రత్యేకించి ఆయన జగన్ సొంత జిల్లా కడపకు చెందిన వారు. ఇక తాజాగా జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి 21 వేలు రావడం వెనక రమేష్ కృషి ఉంది. దాంతో ఆయనకు షా మంచి ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు.

ఏపీలో టీడీపీతో కలసి పనిచేయాలన్నది ఈ ఇద్దరి ఎంపీల మాటగా ఉంది. దాన్ని ఎక్కడా దాచుకోకుండా సీఎం రమేష్ ఈ మధ్యనే చెప్పేశారు. దాన్ని ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ డియోధర్ ఖండించారు. అయినా సరే ఆయన అదే మాటను కొనసాగించారు కూడా. ఇపుడు ఆయననే షా దగ్గరకు తీస్తున్నారు అంటే ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతాయా అన్న చర్చ కూడా ఉంది. చంద్రబాబు ఎటూ బీజేపీతో చెలిమి కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీలో ఎంతో కొంత పుంజుకోవాలని బీజేపీకి ఉంది. దాంతో ఏపీలో రాజకీయ పరిణామాల మీద మొత్తం అధ్యయం చేసిన మీదట అమిత్ షా ఏం చేస్తారు అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. మొత్తానికి షాకి ఈ ఇద్దరు ఎంపీలు సన్నిహితం అవుతున్నారూ అంటే అది ఇండైరెక్ట్ గా చంద్రబాబుకు మేలు చేసే వ్యవహారమే అని కూడా అంటున్నారు. రానున్న రోజుల్లో జరిగే పరిణామాలే దీనికి సరైన జవాబు చెప్పగలవు అన్నది వాస్తవం.