Begin typing your search above and press return to search.

వెళ్లవయ్యా... వెళ్లూ...

By:  Tupaki Desk   |   3 Aug 2016 6:14 AM GMT
వెళ్లవయ్యా... వెళ్లూ...
X
ప్రత్యేక హోదా పోరులో భాగంగా పార్లమెంటులో హల్ చల్ చేస్తున్న టీడీపీ ఎంపీలకు అనుకోని ఇబ్బంది వచ్చిందట.. తాము స్పీకర్ పోడియం ముందు నిల్చుని గొంతు చించుకుని అరుస్తుంటే తమ పార్టీకే చెందిన కేంద్ర మంత్రి తన సీట్లో తాను కూర్చుని చిద్విలాసంగా నవ్వుతుంటే వారికి మండుకొచ్చిందట.. ప్రతిపక్ష పార్టీలవారు ఈ సీను చూస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ వారు ఆయన వద్దకు వెళ్లి ఇక్కడ నువ్వు కూర్చుంటే వాళ్లు విమర్శలు చేస్తారు.. అర్జెంటుగా బయటకు వెళ్లు అని చెప్పారట. దాంతో ఆ కేంద్ర మంత్రి సుజనా చౌదరి చల్లగా అక్కడి నుంచి జారుకున్నారట.

ప్రత్యేక హోదాపై తాడోపేడో తేల్చుకుంటామని టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు - ఎంపీలు కోతలు కోశారు. అవసరమైతే తాము రాజీనామా చేస్తామని కేంద్ర మంత్రులు అన్నారని కూడా టీడీపీ అనుకూల మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే మంగళవారం లోక్‌ సభలో జరిగిన సంఘటనతో అంత సీను లేదని అర్థమైపోయింది. టీడీపీ ఎంపీలంతా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సమయంలో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి అక్కడే ఉన్నారు. అయితే.. ఆయన మాత్రం తన సీట్లోంచి లేవలేదు. ఆందోళన చేయలేదు. ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి చేయకూడదన్నది ఆయన ఉద్దేశం కావొచ్చు. కానీ... టీడీపీ ఎంపీలంతా ఆందోళన చేస్తుంటే ఆయన ఒక్కరే అలా కూర్చోవడం కాంగ్రెస్ సభ్యులు కనిపెట్టారు. పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే పార్టీ మంత్రి మాత్రం దర్జాగా కూర్చుని ఉండడంపై సభలో గుసగుసలాడుకున్నారు.

దీంతో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలు అప్రమత్తమయ్యారు. పార్టీ ద్వంద్వ వైఖరికి బయటపడుతుందన్న ఉద్దేశంతో జరగబోయే సీనును అంచనా వేశారు. కాంగ్రెస్ తమను ఆడుకోవడం ఖాయమని అర్థం చేసుకున్నారు. ఎంపీలు. అవంతి శ్రీనివాస్‌ - తోట నరసింహులు సుజనా వద్దకు వెళ్లి ”నీవు బయటకు వెళ్లవయ్యా” అంటూ సూచించారు. దీంతో తేరుకున్న సుజనా చౌదరి వెంటనే సభనుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత ఎప్పటిలాగే టీడీపీ ఎంపీలు తమ స్థానాల్లో నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు.