Begin typing your search above and press return to search.

టీడీపీ, వైసీపీ ప్ర‌త్య‌ర్థులు ఒక్క చోటికి చేరారు

By:  Tupaki Desk   |   28 July 2017 9:28 AM GMT
టీడీపీ, వైసీపీ ప్ర‌త్య‌ర్థులు ఒక్క చోటికి చేరారు
X
రాజ‌కీయాల్లో అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌నేందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. రాజ‌కీయంగా బ‌ద్ధ‌విరోదులు అయిన వారు ఒకే గూటికి చేర‌డం, మిత్రులుగా ఉన్న వారు సైతం త‌ద‌నంత‌ర కాలంలో ప్ర‌త్య‌ర్థులుగా మార‌డం చూస్తూనే ఉంటాం. అయితే వేర్వేరు పార్టీల్లో ఉన్న‌ప్ప‌టికీ ఒకే వేదికగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వ‌డం..ఒకింత అరుదే క‌దా? అలాంటి నిర్ణ‌యానికి ఏపీ ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ వేదిక అయింది.

శాసనసభకు సంబంధించి కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుల నియామకంలో తూర్పుగోదావ‌రి జిల్లాకు ఎనలేని ప్రాధాన్యం కల్పించినట్టయ్యంది. జిల్లాకు సంబంధించి మళ్లీ రామచంద్రపురం నియోజకవర్గానికి రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ - వైసీపీ ఒక ప్రత్యేక ప్రాధాన్యత కల్పించినట్టయ్యంది. విపక్ష సభ్యుడు ఛైర్మన్‌ గా వ్యవహరించే పీఏసీలో శాసనసభ - మండలిలో ఆయా పార్టీలకు ఉండే బలాబలాల ఆధారంగా సభ్యులను నియమిస్తారు. ఇందులో జిల్లా నుండి టీడీపీ - వైసీపీ ఒక్కొక్కరికి అవకాశం కల్పించాయ. అయతే ఈ ఇద్దరూ రామచంద్రపురం నియోజకవర్గానికి చెందినవారే కావడం విశేషం. అందులో ఒకరు రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు (టీడీపీ) - మరొకరు పిల్లి సుభాష్‌ చంద్రబోసు (వైసీపీ). వీరిరువురు రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. చిరకాల ప్రత్యర్థులైన వీరిరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేది జగద్వితం. తాజాగా పీఏసీలో సభ్యత్వాలు దక్కడంతో ఇరు పార్టీలు వీరిరువురికి సమ ప్రాధాన్యం కల్పించినట్టయ్యంది. కాగా పీఎసీ చరిత్రలో ఒక నియోజకవర్గం నుండి ఇద్దరు సభ్యులు పీఏసీలో కలిగియుండటం ఇదే ప్రథమమని సీనియర్ ఎమ్మెల్యేలు అంటున్నారు.

కాగా, దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పీఏసీ ఛైర్మన్‌ గా ఉన్న గత పీఏసీలో కూడా తోట త్రిమూర్తులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాకు సంబంధించి అక్రమాల గుట్టగా తయారైన వంతాడ గనుల అంశంలో ఛైర్మన్‌ గా భూమా నాగిరెడ్డి - సభ్యునిగా తోట త్రిమూర్తులు తీవ్రంగా స్పందించారు. రాజకీయ పరిస్థితులు తారుమారై, భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీకి మారడంతో, కొంతకాలంగా పీఏసీ వ్యవస్థ మరుగున పడింది. కొత్తగా ఏర్పాటైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే.