Begin typing your search above and press return to search.

ముద్రగడను మెత్తబెడుతున్నారా?

By:  Tupaki Desk   |   4 Feb 2016 6:52 AM GMT
ముద్రగడను మెత్తబెడుతున్నారా?
X
కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన గర్జనతో ఇప్పటికే ఓ విడత తీవ్ర కలకలం రేగింది. ఇక శుక్రవారం నుంచి ఆయన ఆమరణ దీక్షకు దిగుతుండడంతో అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ప్రభుత్వాన్ని భయపెడుతోంది. ఉద్యమం మరింత రగులుతుందేమో అని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. గురువారం సాయంత్రంలోగా ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లపై ప్రకటన రాకపోతే ముద్రగడ శుక్రవారం నుంచి దీక్ష చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఇచ్చిన అల్టిమేటం కూడా అలాగే ఉంది. అయితే.... ప్రభుత్వం కూడా ఇప్పటికప్పుడు రిజర్వేషన్లు ఇవ్వడం అంత సులభం కాదు... కాబట్టి గురువారం సాయత్రంలోగా ప్రకటనా అసాధ్యమే. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వాతావరణం గంభీరంగా ఉంది.

మరోవైపు చంద్రబాబు తాజాగా కూడా కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అయితే. అందుకు సమయం పడుతుందని కూడా క్లియర్ గా చెప్పారు. దీంతో ముద్రగడ తన దీక్షకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ముద్రగడను మెత్తబెట్టేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారని సమాచారం. ఆ బాధ్యతను తోట త్రిమూర్తులుకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.

ముద్రగడ సొంత జిల్లా తూర్పుగోదావరికే చెందిన త్రిమూర్తులు రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు కూడా కాపుల్లో మంచి పట్టుంది. ఆయన వ్యవఃహార దక్షతపైనా చంద్రబాబుకు నమ్మకం ఉంది. అందుకే ఆయనకు ఈ బాధ్యత అప్పగించారు. ముద్రగడ దీక్ష తీవ్ర రూపం దాల్చకుండా ఉండేలా తోట వెళ్లి మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముద్రగడ మనసు మార్చి ఆయన్ను శాంతింపజేస్తారా లేదంటే నిరశన దీక్షను తూతూమంత్రంగా ముగించేలా ఒప్పిస్తారా...? కాకుంటే త్రిమూర్తులు మాటను ముద్రగడ లెక్కచేయకుండా తన ప్లాను తాను అమలు చేస్తారా అన్నది చూడాలి.