Begin typing your search above and press return to search.

కేసీఆర్ చేవ్రాలు కోసం వేల ఫైళ్ల నిరీక్షణ

By:  Tupaki Desk   |   23 Aug 2015 7:42 AM GMT
కేసీఆర్ చేవ్రాలు కోసం వేల ఫైళ్ల నిరీక్షణ
X
ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 1500 మంది ఉండే ఊర్లో రెండు రోజులు గడపటం ఎంత విచిత్రం? ఒక రోజు మొత్తం మట్టిపనుల్ని సమీక్షించటం.. అక్కడి వారికి తన తరఫున భోజనాలు పెట్టించటం.. భవిష్యత్తును అందమైన కలగా చూపించటం మరే ముఖ్యమంత్రికి సాధ్యం కాదేమో? మనలాంటి దేశంలో చిన్న విషయాల మీద ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇంత శ్రద్ధా? అన్నదే ఊహించని విషయం. అందుకే.. అలా చేస్తున్న ఆయన్ను చూసి మురిసిపోతాం.

చిన్న.. చిన్న విషయాల మీదనే ఇంత జాగ్రత్త ఉంటే..పెద్ద విషయాల మీద మరెంత జాగ్రత్తగా ఉంటారని అనుకుంటారు. అయితే.. తాను చేసే ప్రతి పని వ్యూహాత్మకంగా ఉండటం.. తాను మాట్లాడే ప్రతి మాట.. తక్కెడలో తూకం వేసినట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పట్టాన అర్థం కారు. ఆయన్ను అర్థం చేసుకోవటం ఒక పట్టాన సాధ్యమయ్యే విషయం కాదు.

తియ్యగా కనిపించే చేదుమాత్ర మాదిరే కేసీఆర్ పనులుంటాయి. అలా అని ఆయనలోని చేదు కోణాన్ని గుర్తించటం అంత చిన్న విషయం కాదు. చాలా సునిశితంగా దృష్టి పెడితే తప్ప ఆయనలోని మరోకోణం అస్సలు కనిపించదు. ఉత్సాహంగా జిల్లాలు తిరుగుతూ.. గ్రామజ్యోతి పేరుతో గ్రామాల్ని ఉద్దరిస్తున్నట్లుగా కనిపించే కేసీఆర్ తీరు చూసినప్పుడు.. ‘‘మాంచి హుషారు మీదున్నడు. ఇలాటోడు ఏదైనా చేయగలడు’’ అన్న వ్యాఖ్య వినిపిస్తుంది. నిజమే.. నాణెంలోని మరో కోణం చూసినప్పడు కేసీఆర్ ఏమైనా చేయగలడన్న విషయం అర్థం అవుతుంది.

సెక్రటేరియట్ లో కేసీఆర్ చేవ్రాలు కోసం వందలాది ఫైళ్లు ఎదురుచూస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి మొదలుకొని.. చిన్న చిన్న అంశాలకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. నెలల తరబడి దస్త్రాల్ని చూస్తున్నా వాటిని పెద్దగా పట్టించుకోని సీఎం కేసీఆర్ వైఖరితో ఫైళ్ల గుట్ట రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గతంలో ముఖ్యమంత్రులంతా పర్యటనలు చేసినా.. ఫైళ్లను చూసే విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో తీరుతో వ్యవహరించేవారు. మొత్తంగా ఫైళ్ల క్లియరెన్స్ వేగంగానే ఉండేది. కానీ.. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఫైళ్లను చూసే విషయంలో అంత మక్కువ ప్రదర్శించరని చెబుతారు.

పెద్దఎత్తున ఉన్న ఫైళ్లలో ముఖ్యమైన ఫైళ్లను కూడా అధికారులు కేసీఆర్ వద్దకు తీసుకెళ్లే సాహసం చేయరు. ఆయనకు ఆయనగా ఏదైనా ఫైలు గురించి ప్రస్తావిస్తే మాత్రమే తీసుకెళతారన్న మాట తరచూ వినిపిస్తుంటుంది. రాష్ట్ర విభజనకు ముందు సీఎం సహాయ నిది కోసం పెట్టుకున్న దరఖాస్తుల్లో 500పైగా అప్లికషన్లు (వాస్తవానికి వీటికి ఆమోద ముద్ర పడినా.. రాష్ట్ర విభజన కారణంగా చెక్కులు చెల్లకపోవటంతో.. తిరిగి మళ్లీ ఇష్యూ చేయాల్సి వచ్చింది) ఫైలు కేసార్ చేవ్రాలు కోసం ఎదురుచూస్తుంది. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ఫైలు సహా.. వందలాది ఫైళ్లు పెద్ద గుట్ట మాదిరిగా ఎదురుచూస్తున్నాయని చెబుతున్నారు.

సచివాలయానికి ముఖ్యమంత్రి రాకపోవటం.. నెలకు ఒకట్రెండు సార్లకు మించి వెళ్లకపోవటంతో పాటు.. ఫైళ్ల క్లియరెన్స్ అధికారులతో భేటీ కాకపోవటం లాంటి కారణాల వల్ల సమస్య తీవ్రత అస్సలు తెలీటం లేదని చెబుతున్నారు. ఇక..ముఖ్యమంత్రి వద్దకు ఫైళ్లు తీసుకెళితే.. విచిత్రమైన అనుభవం ఎదురవుతుందని అందుకే.. ఎవరూ తొందరపడరని చెబుతారు. 1500 గ్రామస్తులు ఉన్న ఊరు కోసం రెండు రోజులు కేటాయించి.. వారి బాగు కోసం తపించిన కేసీఆర్.. తన చేవ్రాలుతో వేలాది మంది సమస్యలు తీరే వీలున్నా.. ఫైళ్ల దగ్గరగా కుదురుగా ఎందుకు కూర్చోవటం లేదు? కొండలా పేరుకుపోయిన ఫైళ్లను ఎందుకు క్లియర్ చేయటం లేదు..?