Begin typing your search above and press return to search.

బ్యాంకుల పొదుపు ఖాతాల్లో క్లెయిమ్ చేయ‌కుండా వేల కోట్ల నిధులు!

By:  Tupaki Desk   |   28 July 2022 10:39 AM GMT
బ్యాంకుల పొదుపు ఖాతాల్లో క్లెయిమ్ చేయ‌కుండా వేల కోట్ల నిధులు!
X
దాదాపు ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ (పొదుపు ఖాతా) ఉండే ఉంటుందంటే ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. మ‌రికొంత‌మందికి రెండు, మూడు ఖాతాలు కూడా ఉంటాయి. ఈ ఖాతాల్లో ఎంతో కొంత మొత్తం ఉండే ఉంటుంది. అయితే అన్ని ఖాతాల‌ను వినియోగ‌దారులు స‌రిగా వాడ‌రు. కొన్ని ఖాతాల‌ను అలాగే వ‌దిలేస్తారు. దీంతో వాటిలో ఉండే కాస్తా కూస్తో సొమ్ము అలాగే ఉండిపోతుంది.

అలాగే మరికొందరు మెచ్యూర్డ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కోసం బ్యాంకులకు రిడెంప్షన్‌ క్లెయిమ్‌లను సమర్పించకుండా వదిలేస్తుంటారు. వీటినే క్లెయిమ్‌ చేయని నిధులుగా పిలుస్తుంటారు. ఇలా దేశ‌వ్యాప్తంగా బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ చేయ‌ని సొమ్ము ఏకంగా రూ.48,262 కోట్లు ఉంద‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాంబుపేల్చింది.

ఇలా క్లెయిమ్ చేయ‌కుండా వ‌దిలేస్తున్న అన్ క్లెయిమ్డ్ ఖాతాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ల్లోనే ఎక్కువ‌ని ఆర్బీఐ వెల్ల‌డించింది. సెంట్రల్ బ్యాంక్ నివేదిక ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 39,264 కోట్లుగా ఉన్న ఈ నిధులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 48,262 కోట్ల‌కు పెరిగాయ‌ని పేర్కొంది.

ఆర్బీఐ తాజా వార్షిక నివేదికలో అన్‌ క్లెయిమ్ ఫండ్స్‌ గురించి పలు వివరాలను వెల్లడించింది. ఈ క్లెయిమ్‌ చేయని నిధుల్లో ఎక్కువ శాతం ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌తో పాటు మిగతా 8 రాష్ట్రాల్లో ఉన్నాయని పేర్కొంది. తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, ప‌శ్చిమ బెంగాల్, కర్ణాటక, బిహార్‌లు రిజ‌ర్వు బ్యాంక్ తెలిపిన‌ జాబితాలో ఉన్నాయి.

ఇలా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల్లో క్లెయిమ్‌ చేయకుండా మిగిలిపోయిన నిధుల‌ను సంబంధిత‌ వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులకు అందిస్తారు. ఒకవేళ అన్ క్లెయిమ్డ్ ఖాతాల‌కు సంబంధించి ఎవరు లేకపోతే ఆ సొమ్మును ఆర్బీఐ స్వాధీనం చేసుకుంటుంది. ఆ నిధుల‌ను 'డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్ అవేర్‌నెస్‌ ఫండ్‌'కి బదిలీ చేస్తారు.

అయితే ఇలా త‌మ ఖాతాల‌ను వ‌దిలేసిన‌ డిపాజిటర్లు మ‌ళ్లీ తిరిగి ఎప్పుడు వచ్చినా బ్యాంక్‌లో ఉన్న తమ సొమ్మును వడ్డీతో సహా క్లెయిమ్‌ చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి నిధులపై ఆయా ప్ర‌భుత్వాలు ప్ర‌చారం చేయ‌డం, అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం వంటివి చేస్తున్నా ఈ క్లెయిమ్‌ చేయని నిధుల మొత్తం పెరుగుతోంద‌ని చెబుతున్నారు.