Begin typing your search above and press return to search.

ఐఫోన్ తయారీ కంపెనీ నుంచి పారిపోయిన వేలాది ఉద్యోగులు

By:  Tupaki Desk   |   1 Nov 2022 4:07 AM GMT
ఐఫోన్ తయారీ కంపెనీ నుంచి పారిపోయిన వేలాది ఉద్యోగులు
X
ప్రపంచానికి కరోనాను అందించిన చైనా.. దాని నియంత్రణ విషయంలో మిగిలిన దేశాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారిని కఠినంగా తొక్కి పెట్టటం ద్వారా దాని కోరలు పీకే విషయంలో సక్సెస్ అయినట్లుగా భావిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఈ విషయంలో చైనా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు బెడిసి కొడుతున్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఆ దేశంలో ఇప్పటికి లాక్ డౌన్ ను ప్రకటిస్తున్నారు. లాక్ డౌన్ అంటే మన దగ్గర మాదిరి కాకుండా కఠినంగా అమలు చేయటంతో చైనీయులు వణికిపోతున్నారు.

ఎక్కడైనా కొవిడ్ ఆంక్షలు మొదలు కానున్నాయన్న సమాచారం అందిన వెంటనే.. వారు ఆ ప్రాంతం నుంచి జంప్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్న వైనం షాకింగ్ గా మారింది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఉత్తర చైనాలోని ఐఫోన్లు (యాపిల్ కంపెనీ ఫోన్లు) తయారు చేసే ప్లాంట్ ఒకటి ఉంది. దీన్ని ఫాక్స్ కాన్ కంపెనీ నిర్వహిస్తూ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతంలో కొవిడ్ కేసులు ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి.

ఈ కంపెనీ ఫ్యాక్టరీ ఎంత పెద్దది అంటే.. ఈ ఒక్క ప్లాంట్ లోనే 3.5 లక్షల మంది కార్మికులు పని చేస్తూ ఉంటారు. హెనాన్ ప్రావిన్స్ లోని జెంగ్ జౌలో ఫాక్స్ కాన్ ఫ్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ లో ఉన్న లక్షలాది మందిలో దాదాపు 20 వేల మందికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. దీంతో.. వారిని క్వారంటైన్ కు తరలించిన ప్రభుత్వం.. మిగిలిన ఉద్యోగులపైనా ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తోంది.

దీంతో.. లాక్ డౌన్ తో పాటు.. కరోనా ఆంక్షలకు బెదిరిపోయిన ఉద్యోగులు.. బతికి ఉంటే బలుసాకు తినొచ్చన్నట్లుగా వ్యవహరిస్తూ.. ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ఎత్తైన రక్షణ వలయాన్ని చేధించుకొని మరీ పారిపోయిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి.

కొవిడ్ ను అర్థం చేసుకునే విషయంలోనూ.. దాన్ని నిరోధించే విషయంలో మిగిలిన దేశాల కంటే చైనా సరిగా అర్థం చేసుకోలేదన్న భావన పలువురిలో వ్యక్తమవుతోంది. మహమ్మారిని పుట్టించిన దేశానికి.. దాన్ని ఎలా చూడాలన్న విషయం ఇప్పటికి అర్థం కాకపోవటం విచిత్రమైన విషయంగా చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.