Begin typing your search above and press return to search.

వేల సంఖ్యలో పెళ్లిళ్లు.. కారణం అదేనా?

By:  Tupaki Desk   |   23 Dec 2021 8:30 AM GMT
వేల సంఖ్యలో పెళ్లిళ్లు.. కారణం అదేనా?
X
ఏ షాపింగ్ మాల్ చూసినా సందడే. మరే బంగారం దుకాణానికి వెళ్లినా కూడా జనాలే. ఇక లేడిస్ కార్నర్, బొటిక్... అబ్బో అన్ని షాపుల్లోనూ ఇదే హంగామా... ఎవరిని అడిగినా మా అన్న పెళ్లి... మరిది మ్యారేజ్.. సిస్టర్ వివాహం అంటున్నారు. వచ్చేడాది పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ సడెన్ గా ముహుర్తం ఫిక్స్ చేశారు. మా వాడు ఫారెన్ వెళ్లాలి... మ్యాచ్ ఫిక్స్ అయింది. ఇక ఆలస్యం ఎందుకని చేసేస్తున్నాం. ఇలాంటి మాటలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. వారం రోజుల్లో పెళ్లి ఉందని చెప్పగానే... అందరికీ సందేహాలు వస్తాయి కదా వాటికి సమాధానాలే ఇవి. వీటన్నింటికి కారణాలు ఉన్నాయి. మరి అవేంటంటే...!

ఇది మార్గశిర మాసం. ఈ తెలుగు నెలలోనే మంచి ముహుర్తాలు ఉన్నాయి. ఇదిపోతే పుష్యమి. ఆ మాసంలో వివాహాది శుభకార్యాలకు మంచి ముహుర్తాలు ఉండవు అని పండితులు చెబుతున్నారు. ఫలితంగా ఈ గ్యాప్ లో మూడు ముళ్ల తంతు కానిచ్చేయాలని చాలా మంది హడావిడి చేస్తున్నారు. మార్గశిర మాసం చివరి దశకు చేరుకుంది. ఇక ఈ నెల 29 వరకే శుభముహుర్తాలు ఉన్నాయి. వచ్చే నెల అనగా పుష్యమిలో పెళ్లిళ్లకు ముహుర్తాలు లేవు. ఈ వారంలోగా వేలాది సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్లు పండితులు చెబుతున్నారు. అందుకే చాలామంది పెళ్లి పీటలెక్కడానికి ఆసక్తి చూపుతున్నారు.

కట్నాలు, పెట్టుపోతలు వంటి వాటిని సైతం పక్కన పెట్టేసి... ఆ మూడు ముళ్ల తంతును కానిచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రికార్డు సంఖ్యలో ఈ వారంలో జంటలు ఒక్కటవ్వబోతున్నారు. వచ్చే వారంలో ఎక్కవ సంఖ్యలో వివాహాలు ఉండడం వల్ల ఫంక్షన్ హాళ్లకు కొరత ఏర్పడింది. ఏసీ, నాన్ ఏసీ, నార్మల్ కల్యాణ మండపాలకు సైతం డిమాండ్ ఏర్పడింది. ఏదైనా సరే బుక్ చేసుకోవాలని అనుకున్నా దొరకడం లేదని అంటున్నారు. చేసేది లేక గుడిలోనూ పెళ్లిళ్లను కానిచ్చేస్తున్నారు. టెంపుల్ పెళ్లి తంతు పూర్తయ్యాక... రిసెప్షన్ ఘనంగా జరుపుకుందాం అని ఆలోచిస్తున్నారు.

మరి ఇంత హడావిడిగా పెళ్లిళ్లు ఎందుకు అనే సందేహం రావొచ్చు. అయితే ఇటీవల కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ దేశాలు ఈ వేరియంట్ కు వణికిపోతున్నాయి. కేసులు మరింతగా పెరిగి... లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తుందని పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక విదేశాలకు వెళ్లేవారు కూడా పెళ్లి చేసుకోవడానికి అందుకే తొందర పడుతున్నారు. మళ్లీ అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో వేలాది జంటలు ఒక్కటవ్వబోతున్నారు.