Begin typing your search above and press return to search.

ఆ వైసీపీ ఎమ్మెల్సీతో మా ప్రాణాలకు ముప్పు: వృద్ధ దంపతుల డిమాండ్‌!

By:  Tupaki Desk   |   13 Dec 2022 10:30 AM GMT
ఆ వైసీపీ ఎమ్మెల్సీతో మా ప్రాణాలకు ముప్పు: వృద్ధ దంపతుల డిమాండ్‌!
X
తన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత్‌ బాబుకి ఎట్టకేలకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే పలు షరతులు విధించింది. ఈ క్రమంలో అనంత్‌ బాబు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రవేశించకుండా నిరోధించాలన్న సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

కాగా ఎమ్మెల్సీ అనంత్‌ బాబు వల్ల తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంత్‌ బాబు గతంలో కూడా తమను బెదిరించాడని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు విన్నవించారు. అనంత్‌ బాబు మనుషులు అన్నీచోట్లా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుంచి తమకు ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.

తమ కుమారుడిని హత్య కేసును విచారిస్తున్న ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో సీబీఐతో తమ కుమారుడి మృతిపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు అనంత్‌ బాబుకు బెయిల్‌ ఇవ్వడం సరికాదని అంటున్నారు. అనంత బాబు బెయిల్‌ ను రద్దు చేసి ఆయనను జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా ఇటీవల హైకోర్టులో జరిగిన విచారణలో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ఈ హత్య వైసీపీ ఎమ్మెల్సీ అనంత్‌ బాబు భార్య, మరికొందరి సమక్షంలో జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. సీసీటీవీ ఫుటేజ్‌లో వారు కనిపిస్తున్నారని చెప్పారు. వారిపై కేసు నమోదు చేయకుండా ల్యాబ్‌ నివేదిక కోసం చూస్తున్నామంటూ పోలీసులు కాలక్షేపం చేస్తున్నారని కోర్టుకు నివేదించారు.

ఎమ్మెల్సీ అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేయడం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదించారు. మృతుడి శరీరంపై 32 తీవ్ర గాయాలున్నాయన్నారు. దీన్నిబట్టి చూస్తే సుబ్రహ్మణ్యం హత్య ఘటనలో మరికొందరు పాల్గొన్నారని అర్థమవుతోందని చెప్పారు. ఎమ్మెల్సీ అనంత్‌ బాబుపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా మొదట అనుమానాస్పద మృతి కిందే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు నిరసనలు, ఉద్యమాలు చేశాక ఎమ్మెల్సీని నిందితుడిగా చేర్చారని జడ శ్రావణ్‌ కుమార్‌ గుర్తు చేశారు.

వైసీపీ ఎమ్మెల్సీ అనంత్‌ బాబుకు సహకరించే ఉద్దేశంతోనే రిమాండ్‌ విధించిన 14 రోజుల్లో కస్టడీ కోసం పోలీసులు పిటిషన్‌ వేయకుండా ఆ గడువు దాటాక దాఖలు చేశారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా ఎమ్మెల్సీపై రౌడీషీట్‌ నమోదై ఉన్నప్పటికీ ఎలాంటి నేర చరిత్ర లేదని దిగువ కోర్టుకు పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు రక్తపు మరకలను, ఇతర ఆధారాలను సీజ్‌ చేయలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇలా నిందితుడు ఎమ్మెల్సీ అనంత్‌ బాబు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారన్నారు. అందువల్ల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని విన్నవించారు.

హోంశాఖ తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. శవపంచనామా ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ రీ రిజిస్టర్‌ చేశామన్నారు. దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతోందని తెలిపారు. ప్రత్యేక పరిస్థితులు, ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు భావించినప్పుడే సీబీఐకి అప్పగించాలన్నారు. దర్యాప్తును ఎవరైనా ప్రభావితం చేస్తున్నారనేందుకు ఆధారాలు సైతం లేవన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ను ల్యాబ్‌ కు పంపించామని.. నివేదిక రావాల్సి ఉందని వెల్లడించారు. వీడియోలో ఉన్నవాళ్లు ఎవరనేది తేలితే వారిని నిందితులుగా చేరుస్తామని వివరించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.