Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీకి ముప్పు... ఎవరి నుంచి... ?

By:  Tupaki Desk   |   24 Nov 2021 9:42 AM GMT
వల్లభనేని వంశీకి ముప్పు... ఎవరి నుంచి... ?
X
క్రిష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి ఏపీ రాజకీయాల్లో ఎరగని వారు ఉండరు. ఆయన సినీ నిర్మాత కూడా. జూనియర్ ఎన్టీయార్ తో అదుర్స్ మూవీ తీసి పెద్ద హిట్ కొట్టారు. ఇక రాజకీయాల్లో కూడా డైనమిక్ లీడర్ గా కొనసాగుతున్నారు. ఆయన 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటుకు టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడారు. ఆ తరువాత ఆయన 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి రెండు పర్యాయాలుగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత ఆయన టీడీపీకి దూరమై అధికార వైసీపీతో ఉంటూ వస్తున్నారు. ఇక వల్లభనేని వంశీకి జగన్ కి మధ్య మంచి స్నేహం ఉంది. అప్పట్లో జగన్ విపక్ష నేతగా ఉన్నపుడు విజయవాడ వస్తే ఆయన్ని రోడ్డు మీదనే కౌగిలించుకుని వంశీ సంచలనం సృష్టించారు. ఇక జగన్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి స్నేహితుడిగా మారిపోయారు.

సరే టీడీపీలో ఇంకా చాలా మంది వైసీపీకి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. కానీ వంశీ మాత్రం చంద్రబాబుని, లోకేష్ కి టార్గెట్ చేసుకుని ప్రతీసారీ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అవి ఒక దశలో శృతి మించుతున్నాయి కూడా. అయితే వంశీని కూడా వ్యక్తిగతంగా టీడీపీ టార్గెట్ చేస్తోంది, ఆ పార్టీ వారు సోషల్ మీడియాలో ఆయన మీద దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు అన్న మాట కూడా ఉంది. వంశీకి ఆవేశం ఎక్కువ. మరి ఆయన్ని వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తే ఊరుకోలేక సుమారు నెల రోజుల క్రితం ఆయన కొన్ని అనకూడని మాటలను అనేశారు. ఏకంగా చంద్రబాబు కుటుంబాన్ని అలా బయటకు లాగేశారు.

అయితే అప్పట్లో అది పెద్దగా పబ్లిక్ టాక్ లోకి రాలేదు కానీ ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వంశీ అన్న మాటలను పట్టుకుని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ చేశారు. దాంతో చంద్రబాబు ఆవేశంతో సభను వదిలారు. ఆనక ఆయన మీడియా మీటింగులో తన బాధ చెప్పుకుని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. దీంతో టీడీపీ శ్రేణులు ఈ మొత్తం ఎపిసోడ్ కి మూలకారణం అయిన వంశీ మీదనే నిప్పులు చెరుగుతున్నారు. నాడు ఆయన అలా అనబట్టే కదా ఇపుడు వైసీపీ ఎమ్మెల్యేలు దాని మీద మాట్లాడుతున్నారన్నదే టీడీపీ వారి ఆగ్రహంగా ఉంది. దీంతోపాటు వంశీకి సోషల్ మీడియాలో ఒక లెక్కన ట్రోలింగ్ అవుతోంది. ఆయనకు పెద్ద ఎత్తున బెదిరింపులు కూడా వస్తున్నాయట.

వంశీకి ఎవరి నుంచి ముప్పు ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో బెదిరింపులు మాత్రం ఆయనకు పెద్ద ఎత్తున రావడంతో వైసీపీ సర్కార్ అప్రమత్తం అయింది. వంశీకి సడెన్ గా భద్రతను పెంచేసింది. గతంలో వంశీకి వన్ ప్లస్ వన్ గా భద్రత ఉంటే ఇపుడు దాన్ని ఫోర్ ప్లస్ ఫోర్ కి పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. వంశీ ఈ రోజుకీ టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యే. ఆయనకు వైసీపీ సర్కార్ భద్రతను కల్పించడం అంటే ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది అన్నదే సామాన్యుడికి అర్ధం కాని సీన్ ఉంది. ఏది ఏమైనా వంశీకి ముప్పు నిజంగా ఉందా. ఉంటే ఎవరి నుంచి ఉంది. ఇవన్నీ తెలియని విషయాలే. కానీ సడెన్ గా ఆయన వీఐపీ అయిపోయారు. అధికారంలో లేకుండానే కట్టుదిట్టమైన భద్రతలోకి వెళ్ళిపోయారు.