Begin typing your search above and press return to search.

షోకు సంగ‌తి త‌ర్వాత‌..సెంటిమెంట్లు చూడు బాబు!

By:  Tupaki Desk   |   7 Aug 2017 6:18 AM GMT
షోకు సంగ‌తి త‌ర్వాత‌..సెంటిమెంట్లు చూడు బాబు!
X
అభివృద్ధి మంచిదే. కానీ.. దాని కార‌ణంగా లేనిపోని ఇబ్బందులు రాకూడ‌దు. అభివృద్ధి పేరుతో జ‌రిగే హ‌డావుడితో వాటిల్లే న‌ష్టం అంద‌రికి తెలిసిందే. కానీ.. ప్ర‌భుత్వాలు తాము ఏం అనుకుంటే అదే క‌రెక్ట్ అనే ప‌ద్ధ‌తిలో ఉండ‌టంతో లేనిపోని తిప్ప‌లు ఎదుర‌వుతుంటాయి. తాజాగా కోట్లాది భ‌క్తులు ఆరాధించే బెజ‌వాడ దుర్గ‌మ్మ గుడికి సంబంధించి సాగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై పెద్ద ఎత్తున అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తాజాగా సాగుతున్న అభివృద్ది కార్య‌క్ర‌మాల కార‌ణంగా అమ్మ‌వారి దేవాల‌యానికి.. అమ్మ‌వారి విగ్ర‌హానికి ముప్పుగా మారింద‌న్న మాట వినిపిస్తోంది. ఇంద్ర‌కీలాద్రి కొండ మీద కొత్త నిర్మాణాల కోసం ప‌ర్వ‌తాన్ని భారీ యంత్రాల‌తో త‌వ్వుతున్న వైనంపై ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అమ్మ‌వారి కొండ మీద ఉన్న కొనేరును మూసేసి అక్క‌డ భ‌వానీ మండ‌పాన్ని నిర్మించారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే ప్ర‌దేశంలో జ‌ల‌పాతం..కొనేరు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

21 మీట‌ర్ల పొడ‌వు.. 8 మీట‌ర్ల వెడ‌ల్పు 1.5 మీట‌ర్ల లోతులో కోనేరును నిర్మిస్తున్నారు. ఈ కోనేరులోకి నీళ్లు ప‌డేలా జ‌ల‌పాతాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.3 కోట్ల‌తో చేస్తున్న ఈ నిర్మాణాల కోసం భారీ యంత్రాల్ని వాడుతున్నారు. ప్రొక్లెయినర్లు.. డ్రిల్లింగ్ మిష‌న్లతో కొండ‌ను త‌వ్వుతున్న కార‌ణంగా అమ్మ‌వారి విగ్ర‌హం అదిరే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న‌ను భ‌క్తులు వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అభివృద్ధి ప‌నుల‌పై ఆర్చ‌కులు.. అధికారులు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టంతో త‌వ్వ‌కాల్ని ఆపేశారు. అమ్మ‌వారి ఆల‌యానికి ద‌గ్గ‌ర‌గా ఏర్పాటు చేస్తున్న కొనేరు.. జ‌ల‌పాతం కోసం కొండ‌ను ప‌గుల‌కొడుతుంటే.. దేవ‌స్థానం అధికారులు మాట్లాడ‌క‌పోవ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ద‌స‌రా నాటికి అభివృద్ధి ప‌నులు పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంగా దేవాల‌య అధికారుల ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు. షోకులు మంచిదే కానీ.. ఆ కార‌ణంగా సెంటిమెంట్లు దెబ్బ తిన‌కూడ‌ద‌న్న విష‌యాన్ని ఆల‌య అధికారులు గుర్తిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.