Begin typing your search above and press return to search.

జస్టిస్ ఇందూ మల్హోత్రాకు బెదిరింపు ఆడియో.. రీజ‌నేంటంటే

By:  Tupaki Desk   |   17 Jan 2022 4:41 PM GMT
జస్టిస్ ఇందూ మల్హోత్రాకు బెదిరింపు ఆడియో.. రీజ‌నేంటంటే
X
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన భద్రతలో లోపంపై విచారణ చేస్తున్న కమిటీ ఛైర్మన్‌కు బెదిరింపులు వచ్చాయి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఛైర్మన్‌ జస్టిస్ ఇందూ మల్హోత్రాను బెదిరిస్తూ ఆడియో విడుదలైంది. విచారణ చేయవద్దంటూ బెదిరిస్తూ... సిక్‌ ఫర్‌ జస్టిస్‌( ఎస్ఎఫ్జే) సంస్థ ఆడియోను విడుదల చేసింది. ప్రధాని భద్రతా లోపం కేసుకు దూరంగా ఉండాలని కమిటీ ఛైర్మన్‌ను బెదిరించినట్లు ఆడియోలో ఉంది. గతంలోనూ పలువురు సుప్రీంకోర్టు జడ్జిలను ఎస్ఎఫ్జే సంస్థ బెదిరించింది. ఈ నెల 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు ప్రధాని వెళ్తుండగా.. అడ్డగించిన ఘటనపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

భద్రతా వైఫల్యంపై విచారణ కోసం సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఇందు మల్హోత్రా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, చండీగఢ్‌ డీజీపీ, పంజాబ్‌ అండ్‌ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌, పంజాబ్‌ అడిషనల్‌ డీజీపీ(సెక్యూరిటీ) సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఏకపక్ష దర్యాప్తునకు ఏ మాత్రం వీలు కల్పించకుండా ఉండేందుకే న్యాయపరంగా నిష్ణాతులైన వారికి దర్యాప్తును అప్పజెప్పాలని నిర్ణయించామని జస్టిస్‌ రమణ అన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను కమిటీకి స్వాధీనం చేయాలని పంజాబ్‌ అండ్‌ హరియాణా హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది.

ప్రధాని పర్యటన వేళ జరిగిన భద్రతా వైఫల్యానికి కారణాలేమిటి? దీనికి ఎవరు, ఎంతవరకు బాధ్యులు? ప్రధాని, ఇతర రాజ్యాంగ హోదాల్లో ఉన్నవారికి భద్రతా చర్యలు ఏ విధంగా ఉండాలి? తదితర అంశాలపై కమిటీ సిఫార్సులు చేయనుంది. సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పిస్తుందని జస్టిస్‌ రమణ తెలిపారు. కీలక వ్యక్తుల భద్రతకు సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కొత్త మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే.. ఇప్పుడు ఈ క‌మిటీకే బెదింపులు వ‌చ్చాయి. విచార‌ణ చేయొద్ద‌ని.. అలా చేస్తే.. తీవ్ర ప‌రిణామాలు వుంటాయ‌ని సిక్‌ ఫర్‌ జస్టిస్‌( ఎస్ఎఫ్జే) సంస్థ ఆడియోను విడుదల చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రి దీనిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.