Begin typing your search above and press return to search.

అంబానీకి మ‌రోసారి వారి నుంచి బెదిరింపులు!

By:  Tupaki Desk   |   15 Aug 2022 9:58 AM GMT
అంబానీకి మ‌రోసారి వారి నుంచి బెదిరింపులు!
X
ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త‌, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి, ఆయ‌న కుటుంబానికి మరోసారి బెదిరింపులు వ‌చ్చాయి. ఆగ‌స్టు 15న‌ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నంబర్‌కు ఫోన్ చేసిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఫోన్ చేసి బెదిరించాయి. ఇలా మొత్తం మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయ‌ని స‌మాచారం. ఈ బెదిరింపు కాల్స్ పై ఫిర్యాదు అందుకున్న ముంబై పోలీసులు ఇప్పుడు ఆ ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేసే ప‌నిలో ప‌డ్డారు. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి ఇప్ప‌టికే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న‌ హర్స్కిసాందాస్ హాస్పిటల్ నంబర్‌కు ఈ మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయ‌ని పోలీసులు చెబుతున్నారు. ముంబైలోని డీబీ మార్గ్ పోలీసులు మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ రావడంపై రిలయన్స్ ఫౌండేషన్ ఫిర్యాదు చేసింది. ఆస్ప‌త్రికి మూడు కంటే ఎక్కువ కాల్స్ వచ్చాయి. దీనిపై విచారణ జరుపుతున్నాం అని ముంబై పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం బెదిరింపు కాల్‌లతో సంబంధం ఉన్న ఒక వ్య‌క్తిని ముంబైలోని పశ్చిమ శివారు ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇత‌డి మాన‌సిక స్థితి స‌రిగా లేద‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని అంటున్నారు.

కాగా గత సంవత్సరం, ముకేశ్ అంబానీ నివాసం 'యాంటిలియా' వెలుపల 20 పేలుడు జెలటిన్ స్టిక్‌లతో స్కార్పియో కారు, బెదిరింపు లేఖను పోలీసులు ప‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. పోలీసులకు సమాచారం అందిన వెంటనే.. సచిన్ వాజ్ నేతృత్వంలోని ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ తో సహా పలువురు పోలీసులు విచారణ కోసం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో విచార‌ణాధికారిగా సచిన్ వాజ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని రోజుల తర్వాత, థానేకు చెందిన వ్యాపారవేత్త మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసును కూడా నేష‌న‌ల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి అప్పగించారు . అంబానీ నివాసం వెలుపల దొరికిన స్కార్పియో యజమాని హిరేన్ కావ‌డం గ‌మ‌నార్హం. వారం రోజుల క్రితమే వాహనం చోరీకి గురైందని అతడు అప్ప‌ట్లో పేర్కొన్నాడు. కాగా అత‌డి మృత‌దేహం మార్చి 5, 2021న థానే వద్ద ఒక వాగులో ల‌భించింది.

ఈ సంఘటన తర్వాత, ముఖేష్ అంబానీ కి జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త‌ను అందిస్తున్నారు. అలాగే ఆయ‌న స‌తీమ‌ణి నీతా అంబానీకి వై కేటగిరీ భద్రతను అందించారు. అలాగే వారి పిల్ల‌ల‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌ను అందిస్తోంది.