Begin typing your search above and press return to search.

జింకను వండుకుని తిన్న ఆ తెలంగాణ నేతలెవరు?

By:  Tupaki Desk   |   2 Aug 2019 4:18 AM GMT
జింకను వండుకుని తిన్న ఆ తెలంగాణ నేతలెవరు?
X
భారతదేశంలో వన్యప్రాణి రక్షణ చట్టం ఎంత పటిష్టమైనదో తెలిసిందే. ఈ చట్టం ప్రకారం కేసుల్లో చిక్కుకున్న సినీ ప్రముఖులు - రాజీకీయ నాయకులు ఉన్నారు. హత్యలు - రేప్‌ లు చేసినవారు కూడా కేసుల్లేకుండా తప్పించుకోగలుగుతున్నారేమో కానీ వన్యప్రాణుల జోలికి వెళ్లినవారు మాత్రం తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు కూడా వన్యప్రాణుల మాంసంతో విందు చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లాలో వన్యప్రాణి జింకను వేటాడి కొందరు విందు చేసుకున్నారని.. ఈ సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం మోత్కూర్ మండలంలోని కొండాపురం అటవీ ప్రాంతంలో జింకను వేటాడారని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత దాన్ని వండుకుని విందు చేసుకున్నారని.. అందులో పలువురు రాజకీయనేతలు పాల్గొన్నట్టు సమాచారం.

విందు చేసుకున్న ప్రాంతంలో జింక ఎముకలను గుర్తించిన కొందరు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది - ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఎముకలు జింకవేనని తేలితే విందులో పాల్గొన్నవారందరికీ చిక్కులు తప్పవు. దీంతో సదరు రాజకీయ నాయకల్లోనూ కంగారు మొదలైందట.