Begin typing your search above and press return to search.

రిమాండ్ కు నో చెప్పిన న్యాయమూర్తి.. కారణం ఇదే

By:  Tupaki Desk   |   28 Oct 2022 2:52 AM GMT
రిమాండ్ కు నో చెప్పిన న్యాయమూర్తి.. కారణం ఇదే
X
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు (పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్దన్ రెడ్డి)భారీ మొత్తంతో ఎర వేసి.. బీజేపీలో చేరేందుకు జరిగిన ప్రయత్నాలకు సంబంధించిన అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గురువారం రాత్రి పొద్దుపోయిన వేళ (కాస్త అటు ఇటుగా అర్థరాత్రి సమయంలో) 'ఎర' ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితుల్ని సరూర్ నగర్ లోని న్యాయమూర్తి నివాసంలో ఆయన ఎదుట ప్రవేశ పెట్టారు.

అయితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నో చెప్పేశారు. వారిని తక్షణమే విడుదల చేయాలని.. 41 సీఆర్ పీసీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు. ఈ పరిణామం అధికార టీఆర్ఎస్ కు భారీ షాక్ ను ఇచ్చినట్లుగా చెబుతున్నారు. బుధవారం రాత్రి మొయినాబాద్ లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో బీజేపీ మధ్యవర్తులుగా చెబుతున్న ముగ్గురిని (రామచంద్ర భారతి.. సింహయాజి.. నందకుమార్) పోలీసులు గురువారం రాత్రి సరూర్ నగర్ లోని న్యాయమూర్తి రాజగోపాల్ ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఎదుట హాజరు పర్చారు.

ఈ సందర్భంగా జరిగిన విచారణలో.. ఇరు వర్గాల వాదనల్ని న్యాయమూర్తి విన్నారు. ఎర వేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. దానికి సంబంధించిన సొమ్ములు దొరక్కపోవటం.. దానికి సంబంధించిన ఆధారాల్ని సమర్పించలేకపోవటంతో.. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంతేకాదు.. అదుపులోకి తీసుకున్న నిందితుల్ని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో నిందితుల్ని విడిచిపెట్టినట్లుగా శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు ముగ్గురు నిందితులు వారికి భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారని.. టోకెన్ అడ్వాన్సుగా రూ.15 కోట్ల వరకు వారికి ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఈ ప్రచారానికి అనుగుణంగా.. అందుకు అవసరమైన ఆధారాల్ని పోలీసులు మాత్రం బయటపెట్టలేదు. దీంతో.. ఈ ఎపిసోడ్ లో 'ఎర' ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులు బయటకు వచ్చారు.

మరోవైపు ఫాంహౌస్ లో క్లూస్ టీం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. డబ్బు ఎక్కడైనా దాచారా? అన్న కోణంలో క్షుణ్ణంగా పరిశీలించారు. బుధవారం రాత్రి వేళలో.. మీడియాకు సమాచారం ఇచ్చిన పోలీసులు.. గురువారం మాత్రం ఫాంహౌస్ లోపలకు అస్సలు అనుమతించలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ముగ్గురు ప్రయాణించిన కారులోని బ్యాగుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నా.. అందులో ఎలాంటి నగదు లభించలేదన్న మాట వినిపిస్తోంది. ముగ్గురు నిందితుల్ని తీసుకొచ్చేందుకు వినియోగించిన కారు డ్రైవర్ తిరుపతిని పోలీసులు ప్రశ్నించారు.

బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సింహయాజి.. రామచంద్రభారతిలను తీసుకొచ్చేందుకు డ్రైవర్ తిరుపతిని నియమించారని.. మార్గమధ్యంలో నందకుమార్ కారులోకి ఎక్కినట్లుగా చెప్పారు. అనంతరం వారిని నేరుగా మొయినాబాద్ ఫాంహౌస్ కు తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. అయితే.. మార్గమధ్యలో మరెవరినైనా కలిశారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.