Begin typing your search above and press return to search.

ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీ టికెట్ కోసం టీడీపీలో ముగ్గురు పోటీ!

By:  Tupaki Desk   |   31 July 2022 3:30 PM GMT
ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీ టికెట్ కోసం టీడీపీలో ముగ్గురు పోటీ!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి ఆయా పార్టీలు ఇప్ప‌టి నుంచే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో ఉన్నాయి. ఇబ్బంది లేని చోట‌, గ‌ట్టి అభ్య‌ర్థులు ఉన్న చోట ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల ఒకే నియోజ‌క‌వ‌ర్గానికి ఇద్ద‌రు, ముగ్గురు అభ్య‌ర్థులు పోటీ ప‌డుతుండ‌టం ఆ పార్టీల‌కు త‌ల‌నొప్పిగా మారింద‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా అనంత‌పురం జిల్లా హిందూపురం టీడీపీకి కంచుకోట‌. గ‌తంలో వైఎస్సార్ హ‌యాంలో కాంగ్రెస్ గాలిలోనూ, గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ గాలిలోనూ హిందూపురంలో టీడీపీ అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో అసెంబ్లీ సీటును గెలుచుకోగ‌లిగిన టీడీపీ.. ఎంపీ సీటును వైఎస్సార్సీపీకి పోగొట్టుకుంది. 2009, 2014 ఎన్నిక‌ల్లో హిందూపూర్ లోక్ స‌భ స్థానం నుంచి నిమ్మ‌ల కిష్ట‌ప్ప టీడీపీ నుంచి విజ‌యం సాధించారు. అయితే 2019లో నిమ్మ‌ల కిష్ట‌ప్ప ఓడిపోయారు. సీఐగా ప‌నిచేస్తూ వైఎస్సార్సీపీలో చేరిన గోరంట్ల మాధ‌వ్ హిందూపూర్ నుంచి గెలుపొందారు.

కాగా టీడీపీ కంచుకోట అయిన హిందూపూర్ లోక్ స‌భ స్థానంలో ఎలాగైనా ఈసారి గెలుపొందాల‌ని టీడీపీ వ్యూహాలు ప‌న్నుతోంది. ఈ నేప‌థ్యంలో సీటు కోసం ముగ్గురు పోటీ ప‌డుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో టీడీపీ అధిష్టానం త‌ల ప‌ట్టుకుంద‌ని అంటున్నారు.

మాజీ ఎంపీలు నిమ్మల కిష్ట‌ప్ప‌, బీకే పార్థ‌సార‌థి ఇద్ద‌రూ టికెట్ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. బీకే పార్థ‌సార‌ధి గ‌తంలో పెనుకొండ ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. అలాగే 1999లో హిందూపూర్ ఎంపీగా గెలిచారు. 2004లో కేవ‌లం 1840 ఓట్ల‌తో ఓడిపోయారు. వీరిద్ద‌రూ కాకుండా వాల్మీకి సామాజిక‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు అంబికా ల‌క్ష్మీనారాయ‌ణ సైతం ఎంపీ టికెట్ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని చెబుతున్నారు.

అయితే ఈ ముగ్గురిలో నిమ్మ‌ల కిష్ట‌ప్ప అంత చురుగ్గా లేర‌ని చెబుతున్నారు. ఆరోగ్యం కూడా స‌హ‌క‌రించ‌డం లేద‌ని అంటున్నారు. పార్టీ స‌మావేశాల‌కు, కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌ర‌వ‌డం మానేశార‌ని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో బీకే పార్థ‌సార‌ధి లేదా అంబికా ల‌క్ష్మీనారాయ‌ణ‌ల్లో ఒక‌రు హిందూపురం టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.