Begin typing your search above and press return to search.

మూడు రాజధానులు....వైసీపీకి అతి పెద్ద సందేహం...?

By:  Tupaki Desk   |   24 Oct 2022 10:39 AM GMT
మూడు రాజధానులు....వైసీపీకి అతి పెద్ద సందేహం...?
X
ఏపీలో మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే. ఆ పార్టీకి పోటీగా ఏమైనా దీని వల్ల వచ్చే రాజకీయ మైలేజ్ ని సొమ్ము చేసుకునే పార్టీ మరోటి లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచమని కోరుతున్నాయి. ఒక వేళ అమరావతి రాజధానిగా ఉంటే క్రెడిట్ మొత్తం టీడీపీకే పోతుంది. అలాగే మూడు రాజధానులు కనుక సాకారం అయితే వైసీపీకే ఆ గొప్పదనం దక్కుతుంది. కానీ మూడు రాజధానులకు రాచబాట పడుతుందా. అసలు అది అయ్యే విషయమేనా అన్నది కూడా ఒక చర్చగా ఉంది.

ఇదిలా ఉంటే మూడు రాజధానులు అన్నది వైసీపీ ఆరాటమే తప్ప జనాలలో పెద్దగా లేదని అంటున్నారు. అదెలాగో ఇపుడు చూద్దాం. ముందుగా విశాఖ విషయానికి వస్తే రాజధానిగా విశాఖ ఉండాలా వద్దా అంటే జనాలకు ఇది పట్టని వ్యవహారం అయింది. విశాఖ రాజధానిగా వస్తే మాకేంటి రాకుంటే జరిగేది ఏముంది అన్నదే విశాఖ వాసుల మనోగతంగా కనిపిస్తోంది.

ఇక ఉత్తరాంధ్రాలో చూసుకున్నా జనాల్లో అలాంటి నిర్లిప్తత ఉంది. నిజంగా కనుక వారిలో రాజధాని కావాలీ అంటే మూడేళ్ళుగా నలుగుతున్న ఇంతటి కీలక అంశంలో కధ వేరేగా ఉండేదని అంటున్నారు. జనాలు రోడ్ల మీదకు వచ్చేసి అమరావతి రైతులకు పోటీగా ఉద్యమించేవారు అని అంటున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగడంలేదు అంటే జనాలకు వచ్చినా పోయినా ఏమీ కాదన్నదే తేలుతున్న విషయం.

మరో వైపు చూస్తే రాయలసీమ విషయం ఉంది. వారికి న్యాయ రాజధాని అంటున్నారు. హై కోర్టుని ఏర్పాటు చేయాలని అంటున్నారు. అది కూడా అంత తేలిగ్గా తేలే వ్యవహారంగా కనిపించడంలేదు. హై కోర్టు అమరావతిలోనే ఎస్టాబ్లిష్ అయింది. ఒక వేళ ఆకాశాన్ని భూమిని కలిపి హై కోర్టుని కర్నూల్ కి తెచ్చేసినా మాకేంటి ఒరిగేది అన్నదే జనం భావనగా ఉంది అంటున్నారు. ఇపుడు వారు శ్రీభాగ్ ఒప్పందాన్ని తెర మీదకు తెస్తున్నారు.

దాని కంటే ముందు 1953కి కూడా వెళ్తున్నారు. అప్పట్లో కర్నూల్ రాజధానిగా 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయింది. విభజన తరువాత మరో రెండు జిల్లాలు యాడ్ అయ్యాయి. భౌగోళికంగా స్వరూప స్వభావాలు అలాగే ఉన్నాయి. దాంతో తమకు రాజధాని ఎందుకు ఇవ్వరన్నది వారి డిమాండ్ గా కనిపిస్తోంది. అమరావతి నుంచి కనుక రాజధానిని కదిలిస్తే విశాఖ బదులుగా కర్నూల్ లో ఏర్పాటు చేయమని కోరుతున్నారు. లేకపోతే యధాతధ పరిస్థితి అంటే అమరావతిలో రాజధాని ఉంచినా తమకు అభ్యంతరం లేదు అనే అంటున్నారు. మొత్తానికి చూస్తే హై కోర్టు ఇస్తామని అంటే వారు ఏమీ పొంగిపోవడం లేదు.

ఇలా భావావేశాలు రెండు ప్రాంతాలలో పెద్దగా ఏమీ లేకుండా ఉండడంతోనే వైసీపీకి మూడు రాజధానుల అంశం వర్కౌట్ అవుతుందా తమకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాలుస్తుందా అన్నదే పెద్ద డౌట్ గా పట్టుకుంది అంటున్నారు. ఇప్పటికే సంక్షేమ తప్ప అభివృద్ధి ఊసు ఎత్తని వైసీపీకి ఏణ్ణర్ధంతో ఎన్నికల గండం ఉంది.

దాని నుంచి బయటపడి గెలుపు మరోసారి సాధించాలీ అంటే కనుక బలమైన నినాదం ఉండాలి. ఆ నినాదం మూడు రాజధానులుగా ఉంటుందని, అది ఎమోషనల్ గా కూడా వర్కౌట్ అయితే కీలకమైన రెండు ప్రాంతాలలో తిరుగు ఉండదని వైసీపీ వ్యూహకర్తలు భావించినా జనాల్లో మాత్రం ఎక్కడా అది లేదని తేలుతోంది. దాంతో మూడు మీద వైసీపీ మూడ్ మారే చాన్స్ కూడా ఉంది అంటున్నారుట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.