Begin typing your search above and press return to search.

మూడు రాజ‌ధానులు.. జ‌గ‌న్ స‌రికొత్త వ్యూహం ఇదేనా?

By:  Tupaki Desk   |   26 Sep 2022 10:36 AM GMT
మూడు రాజ‌ధానులు.. జ‌గ‌న్ స‌రికొత్త వ్యూహం ఇదేనా?
X
ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు చేస్తున్నా.. హైకోర్టులో ఎదురుదెబ్బ‌తిన్నా మూడు రాజ‌ధానుల‌పై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల‌పైనే ముందుకే వెళ్లాల‌నే నిశ్చయించుకున్నారు. ప్ర‌స్తుతం అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు అంటూ అమ‌రావ‌తి రైతులు మ‌హాపాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. ఈ యాత్ర ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో సాగుతోంది. రైతుల పాద‌యాత్ర‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం మండిప‌డుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇది రైతుల పాద‌యాత్ర కాద‌ని, రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ల పాద‌యాత్ర‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఉత్తరాంధ్ర‌లో బొత్స స‌త్యనారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వంటి మంత్రుల‌తో పాటు ఉత్తరాంధ్ర వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు పాద‌యాత్ర‌ను అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. రైతుల పాద‌యాత్ర కాద‌ని.. అది 29 గ్రామాల పాద‌యాత్ర అని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కు స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌ని చెబుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌ధాని అంశం కూడా ఎజెండాగా మారే అవ‌కాశం ఉండ‌టంతో ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా దీనిపైన దృష్టి సారిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే త్వ‌ర‌లోనే మూడు ప్రాంతాల్లో అంటే.. రాయ‌ల‌సీమ‌, కోస్తాంధ్ర‌, ఉత్త‌రాంధ్ర‌ల్లో స‌భ‌లు నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ స‌భ‌ల్లో తాము మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా ఎందుకు నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింది? మూడు రాజ‌ధానుల వ‌ల్ల క‌లిగే లాభ‌మేమిటి? వంటి అంశాల‌పై ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తార‌ని అంటున్నారు.

శాస‌న రాజధానిగా అమ‌రావ‌తి, ప‌రిపాల‌క రాజ‌ధానిగా విశాఖ‌, న్యాయ రాజ‌ధానిగా క‌ర్నూలును జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నిర్ణ‌యాన్ని వైసీపీ మిన‌హా మిగిలిన అన్ని పార్టీలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. మూడు రాజ‌ధానుల‌కు ఏపీ హైకోర్టులోనూ చుక్కెదురు అయింది. గ‌త మార్చిలో ఏపీ హైకోర్టు మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తూ తెచ్చిన చ‌ట్టాన్ని కొట్టేసింది. దీంతో ఆరు నెల‌ల విరామం తీసుకున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. సుప్రీంకోర్టులో త‌మ‌కు అనుకూలంగా తీర్పు వ‌స్తుంద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆశ‌లు పెట్టుకుంది. మ‌రోవైపు అక్క‌డా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీర్పు వ‌స్తుంద‌ని రాజ‌ధాని రైతులు, ప్ర‌తిప‌క్షాలు ఆశిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో మూడు రాజ‌ధానుల‌పై ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును పొంద‌డానికి వీలుగా మూడు ప్రాంతాల్లో మూడు స‌భ‌లు పెట్టాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే విశాఖ‌, క‌ర్నూలు, విజ‌య‌వాడ‌లో భారీ బ‌హిరంగ స‌భ‌లు పెట్టాల‌ని యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. మూడు రాజ‌ధానులు ఎందుకు? వాటి వ‌ల్ల లాభాలేమిటి? ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండటం వల్ల న‌ష్టాలేమిటి అనే అంశాల‌ను జ‌గ‌న్ వివ‌రించ‌నున్నార‌ని చెబుతున్నారు.

అదేవిధంగా రాజధాని ఏర్పాటుకు సంబంధించి గతంలో శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలు చెప్పిందేమిటి అనే విషయాలను కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తార‌ని తెలుస్తోంది. ఈ మూడు బ‌హిరంగ స‌భ‌లు విజ‌య‌వంత‌మ‌య్యేదాన్ని బ‌ట్టి మ‌రిన్ని స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్లాన్ చేస్తున్నార‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.