Begin typing your search above and press return to search.

15 ఏళ్ల కుర్రాడు ఎడాపెడా కాల్పులు.. అమెరికాలో ముగ్గురు పిల్లలు మృతి

By:  Tupaki Desk   |   1 Dec 2021 11:02 AM IST
15 ఏళ్ల కుర్రాడు ఎడాపెడా కాల్పులు.. అమెరికాలో ముగ్గురు పిల్లలు మృతి
X
అగ్రరాజ్యంలోని గన్ కల్చర్ మీద ఇప్పటికే బోలెడంత చర్చ జరిగింది. అయినప్పటికీ ఆయుధాల్ని పప్పు బెల్లాల మాదిరి అమ్మేసే అమెరికా తీరు మారదు. చేతికి చిక్కిన ఆయుధాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణి పోదు. తాజాగా మరోదారుణం అమెరికాలో చోటు చేసుకుంది. టీనేజర్ ఒకరు స్కూల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. దొరికిన పిల్లల్ని దొరికినట్లుగా చంపేసిన దారుణ ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఏ పాపం తెలీని ఇద్దరు పిల్లలు.. ఒక టీచర్ ఈ టీనేజర్ ఉన్మాదానికి బలయ్యారు.

మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరానికి సమీపంలోని ఒక స్కూల్లో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. షాకింగ్ గా మారిన ఆ కాల్పుల ఉదంతంలో ముక్కపచ్చలారని ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లుగా అధికారులు చెబుతున్నారు. మరణించిన వారిలో ఒక టీచర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో ఆరుగురు గాయాలపాలైనట్లుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కాల్పుల దుర్మార్గానికి పాల్పడిన నిందితుడికి పదిహేను ఉంటాయని చెబుతున్నారు. కాల్పుల ఉదంతం గురించి సమాచారం అందుకున్నంతనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. స్కూల్ ను రౌండప్ చేశారు. ఆ వెంటనే స్కూల్లోకి ప్రవేశించి.. నిందితుగా భావిస్తున్న పదిహేనేళ్ల కుర్రాడ్ని అదుపులోకి తీసుకున్నారు.

దారుణానికి పాల్పడిన టీనేజర్ నుంచి ఒక హ్యాండ్ గన్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం.. దాదాపు 15 నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులు జరిపి ఉంటాడని భావిస్తున్నారు. ఇంతకీ ఈ కాల్పులకు కారణం ఏమిటి? అంతలా ఈ టీనేజర్ చంపే వరకువెళ్లాడన్న విషయాలు బయటకు రావాల్సి ఉంది. ఉలిక్కిపడేలా మారిన ఈ ఉదంతానికి సంబంధించి.. నిందితుడి గురించి మరిన్ని వివరాలు బయటకు వెల్లడి కావాల్సి ఉంది.