Begin typing your search above and press return to search.

సొంత‌గూటికి ముగ్గురు మాజీ మంత్రులు?

By:  Tupaki Desk   |   17 Feb 2020 1:30 PM GMT
సొంత‌గూటికి ముగ్గురు మాజీ మంత్రులు?
X
అతిగా ఆశ‌ప‌డే మ‌గ‌వాడు....అతిగా ఆవేశ‌ప‌డే ఆడ‌ది బాగుప‌డ్డ‌ట్లు చ‌రిత్ర‌లో లేదు....న‌ర‌సింహా సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌తో త‌లైవా ర‌జ‌నీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ ఎంతో పాపుల‌ర్ అయింది. అయితే, రాజ‌కీయాల్లోనూ ఈ డైలాగ్‌ను ఆడ, మ‌గ అన్న తేడా లేకుండా అంద‌రికీ అప్లై అవుతుంది. ముఖ్యంగా రాజ‌కీయాల్లో అతిగా ఆశ‌ప‌డ్డ‌వారు లాభ‌ప‌డిన‌ దానిక‌న్నా న‌ష్ట‌ పోయిందే ఎక్కువ‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో వైసీపీ నుంచి టీడీపీ లోకి జంప్ చేసిన మాజీ మంత్రుల ప‌రిస్థితి ఇప్పుడు స‌రిగ్గా ఈ డైలాగ్‌ కు అతికిన‌ట్లు స‌రి పోతుంది. 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచి టీడీపీలోకి ప్లేటు ఫిరాయంచిన ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు....2019 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. దీంతో, అధికారంలో ఉన్న త‌న సొంత పార్టీలోకి జంప్ చేసేందుకు ఆ ముగ్గురు అవ‌కాశ‌వాదులు రెడీగా ఉన్నార‌ట‌. ఇంత‌కీ ఆ ముగ్గురు నేత‌లెవ‌రు...ఏమిటా క‌థ‌...అన్న విష‌యాల‌పై ప్ర‌త్యేక క‌థ‌నం.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఆళ్ల గ‌డ్డ నుంచి భూమా అఖిల ప్రియ‌, ప‌ల‌మ‌నేరు నుంచి అమ‌ర్ నాథ్ రెడ్డి, బొబ్బిలి నుంచి సుజ‌య కృష్ణా రంగారావులు ఎమ్మెల్యేలు గా గెలిచారు. అయితే, కేవ‌లం 2 శాతం ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైన త‌మ పార్టీకి ఈ ముగ్గురు గుడ్ బై చెప్పారు. అధికారం ఉంటే చాల‌నుకున్న ఈ ముగ్గురు అవ‌కాశ‌వాదులు టీడీపీ లోకి జంప్ చేశారు. ఇటువంటి 23 మంది జంప్ జిలానీల‌కు రెడ్ కార్పెట్ ప‌రిచిన చంద్ర‌బాబు...ఆ ముగ్గురికీ ఏకంగా మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. అమాంతం అమాత్యులైపోవ‌డంతో ఈ ముగ్గురు నేతలు 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు వైసీపీపై అవాకులు చ‌వాకులు పేలారు.

అయితే, 2019లో జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంతో సీన్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఏపీలో టీడీపీ చావు దెబ్బ తిని...ఆ పార్టీ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌క‌మైంది. టీడీపీ ఘోర ప‌రాజయం త‌ర్వాత ఈ ముగ్గురూ టీడీపీలో పెద్ద‌గా యాక్టివ్‌ గా లేరు. అరాకొర‌గా అప్పుడ‌పుడు మీడియాలో....టీడీపీ కార్య‌క్ర‌మాల్లో మొక్కుబ‌డిగా క‌నిపిస్తున్నారు. మ‌రోసారి బెల్లం చుట్టు ఈగ‌లు మూగుతాయ‌న్న త‌ర‌హాలో అధికారంలో ఉన్న పార్టీ పంచ‌న చేరేందుకు ఈ ముగ్గురు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టార‌ట‌. వైసీపీలో చేరేందుకు జ‌గ‌న్ స‌న్నిహితుల‌తో ఈ ముగ్గురు నేత‌లు ఇప్పటికే లాబీయింగ్ మొద‌లు పెట్టార‌ట‌. మ‌రి, 2014లో త‌న‌ను వంచించిన‌ జంప్ జిలానీల‌ను జ‌గ‌న్ ఎంత‌వ‌ర‌కు స్వాగ‌తిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.