Begin typing your search above and press return to search.

అమెరికాలో అగ్నిప్ర‌మాదం: ముగ్గురు తెలంగాణ‌వాసుల‌ మృతి

By:  Tupaki Desk   |   26 Dec 2018 8:29 AM GMT
అమెరికాలో అగ్నిప్ర‌మాదం: ముగ్గురు తెలంగాణ‌వాసుల‌ మృతి
X
అగ్ర‌రాజ్యం అమెరికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టెన్నెస్సీ రాష్ట్రంలోని కొలిర్ విల్లీలో జ‌రిగిన ఓ అగ్ని ప్ర‌మాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. వారు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన‌వారు. వారి స్వ‌స్థ‌లం న‌ల్గొండ జిల్లా నేరడు గొమ్ము మండలం గుర్రపుతండా గ్రామం కావ‌డం గ‌మ‌నార్హం.

గుర్ర‌పుతండాకు చెందిన‌ శ్రీనివాస్‌ నాయక్‌ - సుజాత నాయక్ దంప‌తుల‌కు ముగ్గురు సంతానం. ఇద్ద‌రు కుమార్తెలు సాత్విక నాయక్ (16) - జ్వాయి నాయక్‌ (13). ఓ కుమారుడు సుహాస్ నాయక్ (14). శ్రీనివాస్‌ నాయక్‌ గతంలో అమెరికాలో పాస్టర్‌ గా పనిచేశారు. అనంత‌రం స్వరాష్ట్రానికి తిరిగి వ‌చ్చి హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డ్డారు. ఆయన పిల్ల‌లు మాత్రం అమెరికాలోనే ఉండి మిసిసిపీలోని ఓ పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్నారు. శ్రీ‌నివాస్ కు టుంబానికి అక్కడి కొలిర్‌ విలీలోని బైబిల్‌ చర్చిలో భాగస్వామ్యం ఉంది.

క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శ్రీ‌నివాస్ పిల్ల‌ల‌ను స్థానిక చ‌ర్చిని న‌డిపే క్రౌడ్రెట్ కుటుంబం త‌మ ఇంటికి ఆహ్వానించింది. దీంతో సంతోషంగా వెళ్లిన సాత్విక‌ - జ్వాయి - సుహాస్ వారి ఇంటిని అలంక‌రిస్తుండ‌గా అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఇల్లంతా మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో శ్రీ‌నివాస్ దంప‌తుల ముగ్గురు పిల్ల‌లు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. ఆ ఇంటి య‌జ‌మానురాలు కారీ క్రౌడెట్ కూడా మృత్యువాత‌ప‌డ్డారు. మ‌రో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. స్థానిక కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం రాత్రి ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది.

దేశం కాని దేశంలో ముగ్గురు పిల్ల‌లు ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పిల్ల‌ల మ‌ర‌ణ‌వార్త తెలుసుకొని శ్రీనివాస్‌ నాయక్‌ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. వారు హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి అమెరికా పయనమయ్యారు. మృతదేహాలను స్వదేశం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.