Begin typing your search above and press return to search.

3 గంట‌ల వాన‌కు మునిగిన భాగ్య‌న‌గ‌రి

By:  Tupaki Desk   |   26 Aug 2017 6:54 AM GMT
3 గంట‌ల వాన‌కు మునిగిన భాగ్య‌న‌గ‌రి
X
వానా కాలంలో వాన‌లు మామూలే. ఈ విష‌యం చిన్న పిల్ల‌ల‌కు కూడా తెలిసిందే. మ‌రి.. వ‌ర్షాకాలంలో కురిసే వాన‌ల‌కు త‌గిన‌ట్లుగా ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్య‌త అధికారుల మీద ఉంది. వారు స‌రిగా ప‌ని చేస్తున్నారా? లేదా? అన్నది చెక్ చేయాల్సిన బాధ్య‌త అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం మీద ఉంది.

దుష్ట‌దుర్మార్గ సీమాంధ్ర పాల‌న‌లో బంగారం లాంటి నిజాం క‌ట్టించిన హైద‌రాబాద్ ను నాశ‌నం చేసేశారంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండి ప‌డుతుంటే నిజ‌మే క‌దా? అనుకోకుండా ఉండ‌లేని ప‌రిస్థితి. సీమాంధ్ర పాల‌కుల చేతిలో నాశ‌నం అయిన భాగ్య‌న‌గ‌రిని ర‌క‌ర‌కాల విదేశీ మ‌హాన‌గ‌రాల పేర్లు చెప్పి.. వాటి మాదిరిగా హైద‌రాబాద్ ను తాను మార్చ‌నున్న‌ట్లుగా ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన కొత్త‌ల్లో సీఎం కేసీఆర్ చెప్పారు.

అంతేనా.. ద‌శాబ్దాల ద‌రిద్రాన్ని రాత్రికి రాత్రి మార్చ‌లేన‌న్న ఆయ‌న మాట‌లు నిజ‌మే అని స‌మాధాన‌ప‌డ్డారు భాగ్య‌న‌గ‌ర వాసులు. చూస్తుండ‌గానే మూడున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి. ఏ స‌మ‌స్య‌కైనా ప‌రిష్కారం వెతికేందుకు.. ప‌రిష్క‌రించేందుకు అవ‌స‌ర‌మైన గ‌డువుగా దీన్ని చెప్పాలి. మ‌రి.. కోటి మందికి పైనే నివ‌సించే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని కేసీఆర్ ఎంత మార్చారు? ఆయ‌న మార్క్ న‌గ‌రం మీద ఎంత ఉంద‌న్న విష‌యంపై తాజాగా కురిసిన వ‌ర్షం మ‌రింత క్లారిటీ ఇచ్చింద‌ని చెప్పాలి.

వినాయ‌క‌చ‌వితి రోజున వ‌ర్షం ప‌డ‌టం మామూలే. కానీ.. శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు హైద‌రాబాద్ లో మొద‌లైన వ‌ర్షం మూడు గంట‌ల పాటు దంచి కొట్టింది. చినుకుల‌తో మొద‌లైన వ‌ర్షం జోరుగా మారి.. నాన్ స్టాప్ గా వాన కురిసింది. దీంతో.. అప్ప‌టివ‌ర‌కూ బాగానే ఉంద‌నిపించిన భాగ్య‌న‌గ‌రి డొల్ల‌త‌నం ఒక్క‌సారిగా బ‌య‌ట ప‌డింది. నాలాలు నిండిపోతే.. వ‌ర్ష‌పు నీటి ధాటికి డ్రైయినేజి వ్య‌వ‌స్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప‌డే వ‌ర్షం వెళ్లే దారి లేక రోడ్ల మీద వ‌ర్ష‌పు నీరుతో రోడ్లు కాస్తా త‌టాకాలుగా మారిపోయాయి. ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది.

విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగి విద్యుత్‌ను పున‌రుద్ధ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. గ్రేట‌ర్ ప‌రిధిలో దాదాపు 18 చోట్ల చెట్లు నేల కూలాయి. 42 చోట్ల అత్య‌ధికంగా నీళ్లతో నిండిపోయాయి. రాత్రికి రాత్రే గ్రేట‌ర్ కంట్రోల్ రూంకు 129 ఫిర్యాదు అందాయి. ఇదిలా ఉంటే.. వ‌ర్షం నీటితో రాత్రి వేళ‌లోనూ ట్రాఫిక్ జాం చోటు చేసుకుందంటే వ‌ర్షం తీవ్ర‌త ఇట్టే అర్థ‌మ‌వుతుంది. భారీగా కురిసిన వ‌ర్షంతో లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షం ధాటికి గోడ‌లుకూలిన ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

పండుగ వేళ ఉత్సాహంగా ఉన్న భాగ్య‌న‌గ‌ర వాసులు.. భారీ వ‌ర్షంతో కిందామీదా ప‌డ్డారు. ప‌లు అపార్ట్ మెంట్ల సెల్లార్ల‌లో కి నీళ్లు రావ‌టంతో అపార్ట్ మెంట్ వాసులు తీవ్ర అవ‌స్థ‌ల‌కు గుర‌య్యారు. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం కావ‌టంతో ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. రాత్రి వేళ కావ‌టంతో బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి. ఇళ్ల‌ల్లోకి నీళ్లు రావ‌టంతో వాటిని తోడిపోసుకోవ‌టంతో స‌రిపోయింది.

భారీ వ‌ర్షంతో ప్ర‌ధాన ర‌హ‌దారుల‌న్నీ నీటితో నిండిపోయాయి. ఇప్ప‌టికే రోడ్ల మ‌ధ్య‌లో గంట‌లు ఉండ‌టంతో వాహ‌న‌దారులు తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌య్యారు. మూడున్న‌రేళ్ల‌లో భాగ్య‌న‌గ‌రిని ఏదేదో చేస్తాన‌ని చెప్పిన సీఎం కేసీఆర్ మాట‌లు.. ఎంత వ‌ర‌కు నిజం అయ్యాయ‌న్న విష‌యం భాగ్య‌న‌గ‌రి వాసులకు అర్థ‌మ‌య్యేలా చేసింద‌ని చెప్పాలి. తెలంగాణ‌ను ప‌ట్టి పీడించిన విద్యుత్ స‌మ‌స్య‌ను అధిగ‌మించాన‌ని చెప్పే కేసీఆర్‌కు.. ఒక మ‌హాన‌గ‌రాన్ని వ‌ర్షం బారి నుంచి ఎందుకు ర‌క్షించ‌లేక‌పోతున్నారంటారు?