Begin typing your search above and press return to search.

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు టిసిఎస్ టెకీల మృతి!

By:  Tupaki Desk   |   2 July 2018 10:13 AM GMT
రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు టిసిఎస్ టెకీల మృతి!
X
వారంతా టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు.....అంద‌రికీ ఐదంకెల జీతం.....వీకెండ్ లో స‌హోద్యోగుల‌తో క‌ల‌సి సర‌దాగా స‌మ‌యం గ‌డిపేందుకు విహార యాత్ర‌కు వెళ్లారు. అయితే, తిరుగు ప్ర‌యాణంలో వారిని విధి వెక్కిరించింది. వారు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం రోడ్డు ప్ర‌మాదానికి గురవ‌డంతో విహార యాత్ర విషాదాంత‌మైంది. ఆ ఘోర ప్ర‌మాదంలో ముగ్గురు ఉద్యోగులు మృత్యువాత ప‌డ్డారు. మిగిలిన వారంతా తీవ్ర‌గాయాల‌పై ఆసుప‌త్రిలో చికిత్స్ పొందుతున్నారు. వారాంతంలో విహార యాత్రలో విషాదం జ‌ర‌గ‌డంతో వారి కుటుంబ‌స‌భ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. టీసీఎస్ కు చెందిన ఆరుగురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వీకెండ్ లో విహారయాత్ర కోసం ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు ఆదివారం వెళ్లారు. యాత్ర ముగించుకొని తిరిగి వ‌స్తుండ‌గా నిర్మ‌ల్ స‌మీపంలో వారు ప్ర‌యాణిస్తున్న ఇన్నోవా కారు టైరు పేలిపోయింది. దీంతో, ఆ వాహ‌నం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘోర ప్ర‌మాదంలో దినేష్‌ (27) - కుసుమ (28) అక్కడికక్కడే మృతిచెందారు.

ఆ దుర్ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ మిగ‌తా నలుగురిని హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. యుగంధర్‌ - శ్రీవిద్య - నవీన్‌ - నిఖిత ల‌ను నిజామాబాద్‌ కు తరలించారు. అయితే, నిజామాబాద్‌ లో చికిత్సపొందుతూ శ్రీవిద్య మృతిచెందింది. అతి వేగ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాంతో పాటు ఇన్నోవా కండిషన్ చెక్ చేసుకోక‌పోవ‌డం కూడా ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి - దర్యాప్తు జరుపుతున్నారు. త‌మ పిల్ల‌లు జీవితంలో స్థిర‌ప‌డ్డార‌నుకుంటున్న సంద‌ర్భంలో తిరిగిరాని లోకాల‌కు వెళ్ల‌డంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. త‌మ సంస్థ‌లో ప‌నిచేస్తోన్న ముగ్గురు ఉద్యోగులు హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో ఆ సంస్థ ఉద్యోగులు కూడా షాక‌య్యారు.