Begin typing your search above and press return to search.

ముగ్గురు కీలక నేతల ఆధ్వర్యంలో పాదయాత్రలో జోరు

By:  Tupaki Desk   |   8 Feb 2021 11:30 PM GMT
ముగ్గురు కీలక నేతల ఆధ్వర్యంలో పాదయాత్రలో జోరు
X
ప్రదేశ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో ఉండదని తేలిపోగానే కీలక నేతల దృష్టి ఒక్కసారిగా పాదయాత్రపైకి మళ్ళింది. రైతు సమస్యలను తెలుసుకుని, పరిష్కారాలు కనుక్కునేందుకే పాదయాత్రలను ప్లాన్ చేస్తున్నారు. ఇఫ్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలైపోయింది. మహబూబర్ నగర్ జిల్లాలోని అచ్చంపేట నుండి హైదరాబాద్ వరకు రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టారు.

రేవంత్ పాదయాత్ర అనగానే సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క, సంగారెడ్డి ఎంఎల్ఏ జగ్గారెడ్డి కూడా పాదయాత్రలను ప్రారంభించబోతున్నారు. భట్టీ తన యాత్రను ఆదిలాబాద్ జిల్లా లోని భీంసరి నుండి ఖమ్మం వరకు ప్లాన్ చేశారు. ఈనెల 9వ తేదీన ప్రారంభమయ్యే యాత్ర 13 రోజుల పాటు సాగబోతోంది. ఇక జగ్గారెడ్డి యాత్ర ఈనెల 10వ తేదీన మొదవ్వబోతోంది. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మొదలవ్వబోయే యాత్ర వైరీటీగా హైదరాబాద్ లోని ప్రగతిభవన్ దగ్గర ముగుస్తుంది. ప్రగతిభవన్ అంటే అందరికీ తెలిసిందే కేసీయార్ అధికారిక నివాసమని.

మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోని ముగ్గురు కీలక నేతలు పాదయాత్రతో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా ఏకకాలంలో పాదయాత్రలు చేయాలని డిసైడ్ చేయటం బహుశా ఇదే మొదటిసారేమో. గతంలో ఎప్పుడో సబితా ఇంద్రారెడ్డి భర్త దివంగత ఎంఎల్ఏ ఇంద్రారెడ్డి ఆద్వర్యంలో పాదయాత్ర జరిగింది. తర్వాత వైఎస్సార్ కూడా పాదయాత్రను రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళలోనే మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

పీసీసీ అధ్యక్ష పదవి కోసం తమలో తాము కొట్టుకోవటం కాకుండా జనాల సమస్యల మీద ముఖ్యంగా రైతాంగ సమస్యలపై ఆందోళనలు చేయాలని, పాదయాత్రలు చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించటం, ఆచరణలో పెట్టడం సంతోషించ పరిణామమనే చెప్పాలి. గతంలో ఎవరు పాదయాత్రలు చేసినా తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి. దీనికి వైఎస్సార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డే మంచి ఉదాహరణలు. కాబట్టి ఇపుడు కాంగ్రెస్ నేతలు చేస్తున్న పాదయాత్రలు భవిష్యత్తులో ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే ఆసక్తి పెరిగిపోతోంది.