Begin typing your search above and press return to search.

ఏమిటీ ఘోరాలు.. ఎంతకీ ఆగని శోకం

By:  Tupaki Desk   |   13 Sep 2015 4:05 AM GMT
ఏమిటీ ఘోరాలు.. ఎంతకీ ఆగని శోకం
X
శుక్రవారం రాత్రి నుంచి మొదలైన ‘ఘోర దుర్ఘటన’లకు సంబంధించిన వార్తల పరంపర.. శనివారం మొత్తం కొనసాగింది. ఒకపక్క మక్కామసీదులో క్రేన్ భాగం కూలి వందకు పైగా మరణిస్తే.. అందులో ఇద్దరు ముగ్గురు భారతీయులున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత కర్ణాటకలో చోటు చేసుకున్న ముంబయికి వెళ్లే దురంతో ట్రైన్ పట్టాలు తప్పటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

ఉదయం లేచిన వెంటనే తెలిసిన ఈ వార్త షాకింగ్ గా మారిన పరిస్థితి. మధ్యాహ్నానానికి గమ్యస్థానాలకు చేరుకుంటారని భావించిన పలువురు ప్రయాణికుల కుటుంబాలకు.. రైలు పట్టాలు తప్పిన వార్త విని నోట మాట రాలేదు. ఈ ఘటనతో సంబంధం ఉన్నా.. లేకున్నా.. ఘటన గురించి విన్న వెంటనే అందరి మనసులు బాధతో మూలిగాయి.

దీని నుంచి బయటపడే సమయానికి మధ్యప్రదేశ్ లో ఒక రెస్టారెంట్ లో గ్యాస్ స్తంభం పేలి భారీ ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయన్న మాట విన్న వెంటనే నోట మాట రాలేదు. గ్యాస్ స్తంభం పేలితే.. ఇంత మంది మృతి చెందుతారా? అన్న సందేహాల నుంచి తేరుకోకముందే.. 20.. 30.. 40.. 60.. 70.. 80.. 89 గా గంటల వ్యవధిలో మృతుల సంఖ్య మారిపోయింది.

గ్యాస్ స్తంభం పేలితే ఇంత భారీగా మృత్యువాత పడతారా? అన్న సందేహం వ్యక్తమైనా.. ఏమో అలా కూడా జరుగుతుందేమో అనుకున్నంతలో ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన పేలుడు పదార్థాలు పేలటంతో ఈ భారీ ఘోరం జరిగినట్లుగా భావిస్తున్నారు.

ఇలా ఒకటి తర్వాత ఒకటిగా వెలువడుతున్న ధుర్ఘటనలతో గత 48 గంటలుగా వేదన వదలనిదిగా మారింది. మృతి చెందిన వారే కాదు.. గాయపడిన వారి సంఖ్య మూడు ఘటనలలో కలిపి వందలాది మంది ఉండటం ఆందోళన కలిగిస్తుంది. మొత్తంగా.. ఈ మూడు ఘటనలు మిగిల్చిన విషాదం మర్చిపోలేనిదిగా మారింది.