Begin typing your search above and press return to search.

మందులు ఇవ్వకుండానే.. కరోనా పై 3 నెలల చిన్నారి విజయం

By:  Tupaki Desk   |   27 April 2020 11:30 PM GMT
మందులు ఇవ్వకుండానే.. కరోనా పై 3 నెలల చిన్నారి విజయం
X
వణికించే కరోనా వైరస్ కారణంగా వేలాది మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటివేళ.. కేవలం మూడు నెలల చిన్నారి ప్రమాదకర వైరస్ పై విజయాన్ని సాధించటం అద్భుతంగా మారింది. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో చోటు చేసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న యూపీలో అద్భుతమే చోటు చేసుకుంది.

ఏప్రిల్ 12న జరిపిన పరీక్షల్లో తల్లికి నెగిటివ్ రాగా.. ఆమెకు చెందిన మూడు నెలల బాబుకు మాత్రం పాజిటివ్ గా తేలింది. నెలల పిల్లాడు కావటంతో అతడ్ని వదిలిపెట్టటం ఇ్బబందిగా మారింది. దీంతో ఆ చిన్నారికి ఎలాంటి చికిత్స చేయాలన్నది ప్రశ్నగా మారింది. దీంతో.. గోరఖ్ పూర్ వైద్యులు వినూత్నంగా వ్యవహరించారు.

ఎలాంటి మందులు ఇవ్వకుండా.. ఆ చిన్నారి పట్ల ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శించారు బాలుడికి పాలిచ్చే సమయంలో తల్లికి గ్లౌజులతో పాటు మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాలిచ్చిన తర్వాత బాబుకు తల్లిని దూరంగా ఉంచారు. కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత బాబుకు జ్వరం తప్పించి మరే ఆరోగ్య సమస్యా రాలేదు. దీంతో.. మందులు వాడలేదు. ఇదిలా ఉంటే.. తల్లిపాలతో వచ్చే రోగ నిరోధక శక్తితో కరోనా వైరస్ పై యుద్ధం చేసిన ఆ చిన్నారి అందులో విజయం సాధించారు.

ఎలాంటి చికిత్స లేనప్పటికీ.. తల్లి పాలతో వచ్చే రోగ నిరోధక శక్తితో కరోనాను జయించినట్లుగా బీఆర్ డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గణేశ్ కుమార్ చెప్పారు. ఏప్రిల్ 25.. 26 తేదీల్లో తల్లికి.. బిడ్డకు ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించామని.. తాజా పరీక్షల్లో నెగిటివ్ ఫలితం రావటంతో వారిని ఇంటికి పంపించారు. ఇంట్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు చేశారు. ఏమైనా ప్రమాదకర వైరస్ కు ఎలాంటి మెడిసిన్లను వాడకుండా దాన్ని అధిగమించటం ఒక ఎత్తు అయితే.. అదంతా మూడు నెలల చిన్నారి విషయంలో చోటు చేసుకోవటం అద్భుతం గా మారినట్లుగా చెప్పక తప్పదు.