Begin typing your search above and press return to search.

ఏపీ 3 రాజధానులు.. తెరపైకి హైదరాబాద్.?

By:  Tupaki Desk   |   18 Dec 2019 4:18 AM GMT
ఏపీ 3 రాజధానులు.. తెరపైకి హైదరాబాద్.?
X
దున్నపోతు ఈనింది అంటే దుడ్డను కట్టేయమన్నాడట వెనుకటికి ఒకడు.. ఏపీ సీఎం జగన్ ఏపీకి 3 రాజధానులు అవసరమని.. ఆంధ్రులు కోల్పోయిన హైదరాబాద్ ఉదంతం దృష్ట్యా అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని ఈ ప్రతిపాదన చేశారు. అయితే ప్రతిపక్ష చంద్రబాబు, టీడీపీ పచ్చమీడియా అప్పుడే మొదలెట్టేసింది. అమరావతి చచ్చిపోతే హైదరాబాద్ కు లాభం అంటూ ప్రచారానికి దిగుతోంది.

పేద, మధ్య తరగతి వారు ఎక్కడైనా పని చేసుకొని బతకాల్సిందే. అది హైదరాబాద్ అయినా.. అమరావతి అయినా ఒక్కటే. పెట్టుబడులు పెట్టే కొంత మంది గుత్తేదారులు, రియల్ ఎస్టేట్ వారికి మాత్రం ఈ అమరావతి, హైదరాబాద్ తేడా.. కోట్ల మంది సామాన్యులకు ఆ తేడానే లేదు.

అందుకే ఇప్పటికే అమరావతి లో పెట్టుబడి పెట్టి దోపిడీకి మార్గం సుగమం చేసుకున్న పచ్చ నేతలు ఇప్పుడు జగన్ చేసిన 3 రాజధానుల ప్రకటనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిజానికి జగన్ చేసిన ప్రకటన అది ప్రజల ఆకాంక్షల నుంచి వచ్చింది. కర్నూలులో హైకోర్టు కావాలన్నది సీమ వాసుల చిరకాల వాంఛ. ఇక వెనుకబడిన ఉత్తరాంధ్ర కు అభివృద్ధి కావాలన్నది అక్కడి వాసుల కోరిక. మధ్యనున్న విజయవాడ ప్రాంతం ఇప్పటికే అమరావతి నిర్మాణంతో ఆర్థికంగా ఇప్పటికే పుంజుకుంది.

రాజధానిని ఒక్కచోటే పెట్టి మిగతా అన్ని ప్రాంతాలను అభివృద్ధి లో విడిచిపెట్టడం తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత అన్యాయం జరిగిందో చూశాం. హైదరాబాద్ ను అభివృద్ధి చేసి మిగతా నగరాలను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. అందుకే జగన్ నిర్ణయం భవిష్యత్ తరాలు, ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు.

అయితే అమరావతి రాజధానిగా పోతే పెట్టుబడి దారులంతా హైదరాబాద్ వస్తారని.. తెలంగాణ రాజధాని మరింత అభివృద్ధి సాధిస్తుందని టీడీపీ నేతలు, మీడియా ప్రచారం మొదలు పెట్టింది. గుప్పెడు మంది పెట్టుబడిదారుల కాసుల కాంక్ష ముఖ్యమా? కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఆకాంక్ష ముఖ్యమా అన్నది ఇక్కడ బేరిజు వేసుకోవాలి. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టే రియల్టర్లు, బడాబాబుల వల్ల ఏపీకి వచ్చే నష్టం ఏమీ లేదు. సామాన్య, మధ్యతరగతికి ప్రయోజనం లేదు. వారి కోసం మరోసారి అమరావతి అంటూ అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేస్తే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వారమవుతాం. హైదరాబాద్ కు పోయే వారంతా డబ్బున్న వారే.. సామాన్య, పేదలకు అమరావతి అయినా కర్నూలు అయినా, విశాఖ అయినా ఒక్కటే. పేదల పక్షపాతిగా జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏపీలోని జనాలకు మేలు చేస్తుంది. ఏపీలోని నగరాలు అభివృద్ధి చెందుతాయనడం లో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.