Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారు సమర్పించు మూడు ముక్కల ఆర్టీసీ

By:  Tupaki Desk   |   8 Oct 2019 8:37 AM GMT
కేసీఆర్ సర్కారు సమర్పించు మూడు ముక్కల ఆర్టీసీ
X
కొత్త ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచించే అలవాటున్న ఆయన.. కొన్నిసార్లు అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజల కళ్లు పత్తికాయల మాదిరి మారేంతగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు దిమ్మ తిరిగేలా ఇప్పటికే షాకిచ్చిన కేసీఆర్.. తాను ఎంచుకున్న దారిలో వడివడిగా అడుగులు వేస్తున్న వైనం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది.

ఓపక్క తాము చేస్తున్న సమ్మెను మరింత పెంచుతామని కార్మికులు హెచ్చరిస్తుంటే.. అసలు మీరెవరు? మీతో మాకు సంబంధం ఏమిటి? మీ ఉద్యోగాల్ని మీరే పీకేసుకున్నారుగా? అలాంటప్పుడు మీరు ఆర్టీసీ ఉద్యోగులు ఎలా అవుతారు? మీకు మాకు సంబంధం లేదన్నట్లుగా తేల్చేయటమే కాదు.. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నది 1200 మందేనని స్పష్టం చేస్తున్నారు.

అంతేకాదు.. రానున్న రోజుల్లో ఆర్టీసీని తాను ఎలా మార్చాలనుకుంటున్నానన్న విషయాన్ని వెల్లడించి మరో సంచలనంగా మారారు. ఇప్పుడున్న ఆర్టీసీని మూడు ముక్కలుగా చేస్తామని చెబుతున్న కేసీఆర్.. సంస్థను పూర్తిగా ప్రైవేటికరించే ఆలోచన తమకు లేదన్నారు. ఆర్టీసీ సొంత బస్సులు 50 శాతం.. అద్దె బస్సులు 30 శాతం.. మిగిలిన 20 వాతం ప్రైవేటు బస్సుల్ని నడిపిస్తామని చెప్పారు. ప్రైవేటు బస్సులకు స్టేజ్ క్యారియర్లుగా అనుమతి ఇవ్వాలని వాటిని నగరంతోపాటు ఇతర రూట్లలో కూడా నడపాలన్న ఆలోచనను ఆయన ఆవిష్కరించారు.

హైదరాబాద్ మహానగరంతో పాటు ఇతర రూట్లలో కూడా ప్రైవేటు బస్సుల్ని నడపాలన్న ఆలోచనను ఆయన వెల్లడించారు. అయితే.. ప్రైవేటు నియంత్రణలో ఉండే బస్సు ఛార్జీలను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందని.. స్వల్ప మొత్తంలో ఛార్జీలు పెంచటానికి ప్రభుత్వం ఒప్పుకోదంటున్నారు. ఆర్టీసీ సంస్థ ఉండి తీరాలని చెబుతూనే.. ప్రైవేటుకు ఓకే చెప్పేయటం విశేషం.

ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో అసౌకర్యం కలుగకుండా చూడటమే ప్రభుత్వం ధ్యేయమంటున్న కేసీఆర్.. అదే సమయంలో ఆర్టీసీని పటిష్ఠపర్చటానికి అవసరమైన అన్ని చర్యల్ని తీసుకుంటామని చెబుతున్నారు. ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ప్రజలు ప్రశంసిస్తున్నారని పేర్కొనటం గమనార్హం. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్.. వేముల ప్రశాంత్ రెడ్డి.. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ.. ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్.. డీజీపీ మహేందర్ రెడ్డి.. రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో కేసీఆర్ సంచలన వాదనల్ని వినిపించినట్లుగా చెబుతున్నారు. మరీ.. వాదనలకు తెలంగాణ సమాజం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.