Begin typing your search above and press return to search.

గంజాయి పై ముప్పేట దాడి

By:  Tupaki Desk   |   2 Dec 2021 5:00 AM IST
గంజాయి పై ముప్పేట దాడి
X
దేశాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాలపై మూడు రాష్ట్రాలు ఏకకాలంలో దాడులు మొదలుపెట్టాయి. దేశం మొత్తానికి ఆంధ్రా-ఒడిస్సా బార్డర్స్ (ఏవోబీ) నుండే గంజాయి సరఫరా అవుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలో మరెక్కడా లేని విధంగా ఏవోబీ నుండే ఎందుకు గంజాయి సరఫరా అవుతోంది ? ఎందుకంటే ఏవోబీ అన్నది మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతం. ఏవోబీ అంటే వేల కిలోమీటర్లలో విస్తరించిన అటవీ ప్రాంతం అన్న విషయం గుర్తుంచుకోవాలి.

మావోయిస్టులకు చాలా గట్టి పట్టున్న ప్రాంతం కాబట్టి ఇందులోకి ఎంటర్ అవటానికి పోలీసులు కూడా వెనకాడుతారు. పోలీసులు అడుగుపెట్టరని తెలిసిన తర్వాత ఇక అడ్డేముంటుంది. అందుకనే స్ధానిక గిరిజనుల్లో కొందరితో పెద్దఎత్తున గంజాయి సాగు చేయిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం 20 వేల ఎకరాల్లో గంజాయి సాగు బ్రహ్మాండంగా జరుగుతోంది. ఇటీవల కాలంలో గంజాయి రవాణా, వాడకం పెరిగిపోతోందనే ఆరోపణల నేపధ్యంలో దీన్ని అదుపు చేయటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఈమధ్యనే ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గంజాయి నియంత్రణను కూడా గట్టిగా చెప్పారు. ఒడిస్సా పోలీసుల సహకారాన్ని కోరటంతో సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. అప్పటికే గంజాయి నియంత్రణకు ఏర్పాటైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)కి ఒడిస్సా పోలీసుల సహకారం కూడా అందుతోంది. దాంతో ప్రత్యేక దళాలు అడవుల్లో తిరుగుతు స్ధానికుల సాయంతో గంజాయి సాగును ధ్వంసం చేయటం మొదలుపెట్టారు. అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటికే 5 వేల ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసంచేసేశారు.

ఇదే సమయంలో ఏపీ, ఒడిస్సా పోలీసలతో తెలంగాణా పోలీసులు కూడా చేతులు కలిపారు. అంటే మూడు రాష్ట్రాల పోలీసులు మూడు వైపుల నుండి గంజాయి వ్యాపారస్తుల మీద ఏకకాలంలో దాడులు మొదలుపెట్టారు. గంజాయి పంటలను ధ్వంసం చేయటమే కాకుండా గంజాయి నిల్వకేంద్రాలు, బ్రోకర్లు, పెడలర్లను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. గంజాయి రవాణాను కంట్రోల్ చేసేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టారు. గంజాయి సాగును గుర్తించేందుకు ద్రోన్లను ప్రయోగిస్తున్నారు.

మొత్తంమీద మూడురాష్ట్రాల పోలీసుల సమిష్టి కృషి కారణంగా గంజాయి సాగు, వ్యాపారం, వాడకం తదితరాలు నియంత్రణలోకి వస్తున్నాయి. గంజాయి వాడకంలో వ్యాపారస్తులు విద్యార్ధులను ప్రధానంగా స్కూలు విద్యార్ధులనే టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. వీళ్ళమేదైతే ఎవరికీ అనుమానాలు రావన్న ఏకైక కారణంతోనే వీళ్ళని మత్తులోకి దింపుతున్నారు. గంజాయి విషయంలో కామన్ ఎఫర్ట్ కంటిన్యు అయితే తొందరలోనే ఈ సమస్య నియంత్రణలోకి వస్తుందని ప్రభుత్వం అనుకుంటోంది. చూడాలి ఏమవుతుందో.