Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు టీడీపీ నాయకుల మౌనం వెనుక..!

By:  Tupaki Desk   |   21 Feb 2019 4:40 AM GMT
ఆ ముగ్గురు టీడీపీ నాయకుల మౌనం వెనుక..!
X
ఏపీలో అధికార టీడీపీ నుంచి నాయకులు జారిపోతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు - ఒక ఎమ్మెల్సీ పార్టీని వీడుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఆ ముగ్గురు మాత్రం ఎలాంటి విషయాలు బయటకు చెప్పడం లేదు. దీనిపై ఖండించడం లేదు. మౌనం వీడడం లేదు. దీంతో వారి మౌనం వెనుక మర్మమేమిటోనని రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి - టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి - రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీని వీడుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై వారిని సంప్రదిస్తే మాత్రం ఏ విషయమూ చెప్పడం లేదట. అయితే రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు.

ఈ తరుణంలో ఆయన గ్రూపులోని సభ్యుడైన ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలోకి వెళ్లారు. దీంతో తోట త్రిమూర్తులు సీఎం చంద్రబాబును కలిసి మంత్రి పదవిపై గట్టి హామీ తీసుకున్నట్లు జిల్లా రాజకీయాలు చెబుతున్నాయి. అయితే సీఎంను కలిసినా కూడా టీడీపీ వీడడం లేదని తోట స్పష్టంగా చెప్పడం లేదు. వైసీపీ నుంచి ఆయనకు ఆహ్వానం ఉన్న విషయం ఎప్పుడో బయటపడింది. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉండడంపై కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

ఒంగోలు మాజీ ఎంపీ - ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వైసీపి ఎంపీ టికెట్‌ ఆఫర్‌ చేసింది. ఈ ప్రచారాన్ని మాగుంట ఖండించడం లేదు. మరోవైపు మాగుంట రాకను వైవీరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు వినిపిస్తోంది. మాగుంట సైతం సీఎంను కలిశారు. మరో నేత కరణం బలరాం కూడా మాగుంటతో చర్చలు జరిపారట. ఆ తరువాత కూడా మాగుంట టీడీపీ నుంచి జంప్‌ కొడాతారని వస్తున్న వార్తలను ఆయన ఖండించడం లేదు. అటు టీడీపీ ఆయనకు మంచి ఆఫర్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. అయినా ఆయన వైసీపీలోకి మారుతారని వస్తున్న వార్తలపై ఏ విధంగా స్పందించడం లేదు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని టీడీపీ - వైసీపీల్లో మాగుంట నిర్ణయం వైపే అందరూ ఎదురుచూస్తున్నారు.

గుంటూరు-2 ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డి అసంతృప్త నేతగా ఫోకస్‌ అవుతున్నారు. నర్సరావుపేట ఎంపీ టికెట్‌ గానీ - బాపట్ల అసెంబ్లీ టికెట్‌ గానీ కన్ ఫామ్‌ చేయాలని హై కమాండ్‌ ను కోరుతున్నారట. అయితే మోదుగుల విజ్ఞప్తులను అధిష్టానం పట్టించుకోలేదట. తనను ద్వితీయ శ్రేణి నాయకుడిగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా నరసరావుపేట ఎంపీ టికెట్‌ ఇప్పటికే లావు కృష్ణ దేవరాయులకు జగన్‌ హామీ ఇచ్చారు. అయితే నరసరావుపేట ఎంపీ టికెట్‌ కుదరకపోతే బాపట్ల అసెంబ్లీ టికెట్‌ అయినా ఇస్తే పార్టీ జంప్‌ కొడతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వస్తున్న వార్తలను మోదుగుల స్పందించకపోవడంతో టీడీపీని వీడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఇలా ముగ్గురు టీడీపీ నేతల వెనుక మర్మమేమిటన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.