Begin typing your search above and press return to search.

ముగ్గురు ఎంపీల చ‌క్ర‌బంధంలో చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   29 April 2016 9:51 AM GMT
ముగ్గురు ఎంపీల చ‌క్ర‌బంధంలో చంద్ర‌బాబు
X
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి కొన‌సాగుతుందా? లేదా? కొత్త పాల‌క వ‌ర్గం వ‌స్తుందా? నిబంధ‌న‌ల ప్రకారం పాల‌క వ‌ర్గ స‌మ‌యం ముగిసినా ప్ర‌భుత్వం ఎందుకు ఇంకా పాల‌క‌వ‌ర్గాన్ని కొన‌సాగిస్తోంది? దీనికి ప్ర‌త్యేక కార‌ణ‌మేమైనా ఉందా? ఒక‌ప‌క్క ఇటువంటి ప్ర‌శ్న‌లన్నీ వ‌స్తుండ‌గానే మ‌రోప‌క్క టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఆశిస్తున్న నేత‌లు సీఎంపై ఒత్తిడి తీసుకొస్తున్నార‌ట‌.

టీటీడీ చైర్మన్‌ గా తిరుపతికి చెందిన చదలవాడ కృష్ణమూర్తితోపాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. ఆ మేరకు మే 1వ తేదీన చైర్మన్‌ తోపాటు పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది పాటు ధర్మకర్తల మండలి పదవిలో కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మండలి పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అయితే ప్రమాణం స్వీకారం చేసింది మే 1న కాబట్టి ఈ ఏడాది మే 1 వరకు వీరు కొనసాగే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తోంది. మ‌రోప‌క్క‌ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని ధర్మకర్తల మండలినే మ‌రో యేడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే స్థానిక ఆలయాల కమిటీలకు పాల‌క‌వ‌ర్గాన్ని రెండేళ్లు పొడిగించారు. ఆ నిర్ణయాన్నే టీటీడీకి కూడా వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. టీటీడీ బోర్డు సభ్యుల్లోని తెలంగాణకు చెందిన సాయన్న ఇప్పటికే టీఆర్‌ఎస్ లో చేరిపోయారు. దీంతో ఒక‌రిద్ద‌రి మార్పుపైనా సీఎం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్న సినీనటుడు - రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ సీఎం చంద్రబాబును కలిశార‌ట‌. అలాగే, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ప్ర‌యత్నాలు చేస్తున్నార‌ట‌. రాయ‌పాటి అయితే టీటీడీ చైర్మ‌న్ త‌న జీవిత‌కాల కోరిక అని అందుకోస‌మే టీడీపీలో చేరాన‌ని, అప్ప‌ట్లో త‌న‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విపై బాబు హామీ ఇచ్చార‌ని కూడా త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకుంటున్నారు.

ఇక వీరిద్ద‌రి త‌ర్వాత బీజేపీ తరపున నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. మ‌రోప‌క్క బోర్డు ఉత్తర్వులు ఇంకా రాకపోవడంతో కొత్త బోర్డుపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో మే రెండో తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మ‌రోవైపు చ‌ద‌ల‌వాడ మాత్రం త‌న‌కు కేవ‌లం యేడాది పాటే అవ‌కాశం ఇచ్చినందున మ‌రో రేండేళ్ల‌పాటు ఈ ప‌ద‌విని పొడిగించాల‌ని సీఎంను కోరుతున్నారు.