Begin typing your search above and press return to search.

స్వ‌రాష్ట్రం ఫ‌లాలు అందుతున్నాయా కేసీఆర్ సాబ్‌

By:  Tupaki Desk   |   9 Jun 2017 4:26 AM GMT
స్వ‌రాష్ట్రం ఫ‌లాలు అందుతున్నాయా కేసీఆర్ సాబ్‌
X
తెలంగాణ‌...దేశంలోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప్రాంతం. ఒక‌ప్పుడు ఉద్య‌మం ద్వారా - ఇప్పుడు ప‌రిపాలన ద్వారా. ఒక ఉద్య‌మ నాయకుడు రాష్ర్టాన్ని ఏర్పాటు చేసే స్థాయికి స‌బ్బండ వ‌ర్గాల‌ను కలుపుకొని చేర‌డం ఒక పాఠం. అదే ఉద్య‌మ నాయకుడు ఆనాడు క‌లుపుకున్న నాయ‌కుల‌కు కంట‌గింపు పాల‌కుడిగా మార‌డం కూడా ఒక పాఠ‌మే. మ‌రోవైపు దేశంలో ఆయ‌న పాల‌న‌కు గుర్తింపు రావ‌డం కూడా గ‌మ‌నించ‌ద‌గిన విష‌య‌మే! తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, సీఎం కేసీఆర్ ప‌రిపాల‌న చేప‌ట్టి మూడు సంవత్సరాలు పూర్తయింది. స్వపరిపాలన - సుపరిపాలన - కొత్త ఒరవడి తపన - ప్రజల ఆకాంక్షలు - అమరుల ఆశయాలు ఏ మేరకు నెరవేరాయన్నది బేరీజు వేసుకోవడానికి ఇదొక సమయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకు ప్రజలిచ్చే గడువు ఐదు సంవత్సరాలే అయినందున తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ ఎస్) నాయకత్వాన ఏర్పడిన తొలి ప్రభుత్వంపై ప‌లువ‌ర్గాల భావ‌న‌ల స‌మాహారం ఇది.

గులాబీ ద‌ళ‌ప‌తి కే చంద్ర‌శేఖ‌ర్ రావు అధికారం చేపట్టిన వెంటనే ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలుగా కొన్ని సంక్షేమ చర్యలను ప్రకటించారు. అందులో నీటి పారుదల - డబుల్ బెడ్ రూమ్ - దళిత - గిరిజనులకు మూడెకరాల భూమి - కేజీ టు పిజి - ఆసరా పెన్షన్‌ లతో పాటు 2014 జూలై 16న జరిగిన సుదీర్ఘ మంత్రిమండలి సమావేశంలో మరో పద్దెనిమిది అంశాలను నిర్థారించారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఎన్నికల హామీల అమలు - రాజకీయ అవినీతి లేని పాలన అందించాలన్నది తమ కృతనిశ్చయమని ప్రకటించారు. ఈ క్రమంలో కెసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల నుండి అభినందనలను అందుకుంటున్న మొదటి అంశం విద్యుత్తు సరఫరా. ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురికావడంతో పాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారం అవుతుందన్న విమర్శలకు ఆచరణ ద్వారా తొలి ప్రభుత్వం దీటైన సమాధానమిచ్చింది. ఏ ఆదరణ లేని వృద్ధులు - వికలాంగులు - వితంతువులకు - చేతి వృత్తుల వారికి నామ మాత్రంగా ఉన్న పెన్షన్లను రూ.1,000- రూ.1,500లకు పెంచడం ఆసరానిచ్చింది. కుటుంబ సభ్యుల సంఖ్యపై ఆంక్షలు లేకుండా రేషన్ బియ్యం సరఫరా - సంక్షేమ హాస్టళ్ళకి సన్నబియ్యం ఇవ్వడం హర్షణీయమైంది. నీటి పారుదల రంగంలో చేపట్టిన మిషన్ కాకతీయ రైతులకు ఊరట కలిగించింది.

తెలంగాణకు కీల‌క‌మైన‌ సాగునీటి వినియోగానికి తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం - భూసేకరణ - రీడిజైనింగ్ పేరుతో తరచూ చేస్తున్న మార్పులు అత్యంత ప్రజోపయోగ పథకాలని భావించినప్పటికీ, పారదర్శకత లోపించడంతో ప్రభుత్వం విమర్శలకు లోనవుతోంది. మిషన్ భగీరథ పేరుతో చేపట్టిన భారీ ప్రాజెక్టు వ్యయం హనుమంతుని వాలం లాగా పెరిగిపోవడం ప్రజల అనుమానాలకు తావిస్తున్నది. అత్యంత ప్రతిష్టాత్మక పథకాలలో భాగమైన డబుల్ బెడ్ రూమ్ - కెజి టు పిజి - మూడెకరాల పంపిణీ కేవలం ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తటానికి చేసిన శుష్క వాగ్దానాలుగా భావించటానికి తార్కాణంగా ఉన్నాయి. ఎన్నికల ప్రణాళికాపత్రంలో ప్రథమ అంశమైన రాష్ట్ర సలహామండలిని ఏర్పాటు చేయకపోవడంతో తొలి వాగ్దానభంగమైంది. రైతాంగం అనాదిగా దోపిడీకి గురవుతున్న వాస్తవాన్ని గుర్తించి “రైతులు మార్కెట్‌లో మోసపోకుండా ఉండేందుకు అన్ని దశల్లో ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తుందని” ఇచ్చిన హామీ అమలు కాకపోగా, ఖమ్మం మార్కెట్ ఘటన ప్రభుత్వానికి మాయని మచ్చగా నిలిచింది. గ‌త పాలకులు నిర్వీర్యం చేసిన స్థానిక సంస్థలకు రాజ్యాంగం 73,74 సవరణల ద్వారా లభించిన అధికారాలను యుద్ధప్రాతిపదికన సంక్రమింపజేస్తామని చూపిన ఆశ అడియాసగానే మిగిలింది.

కేసీఆర్‌ కు త‌న‌ ఉద్యమంపై అనుమానమా? లేక ప్రజలపై విశ్వాసం లేదా? సొంత పార్టీపై అపనమ్మకమో తెలియదు గానీ, ప్రతిపక్షంలో ఎవ్వరూ లేకుండా చేయాలని, అందుకు సామ - దాన - భేద‌ - దండోపాయంతో లొంగ దీసుకున్నారు. తెలంగాణ విభజనను వ్యతిరేకించిన శక్తులను - వ్యక్తులను అందల మెక్కించడం ద్వారా త‌న రాజ‌కీయ చాణ‌క్యంపై అనుమానాలు రేకెత్తించారు. దళితుడిని ముఖ్య మంత్రి చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. అదేమయిందో కేసీఆరే చెప్పాలి. హైదరాబాద్ లో ఏ ధర్నా చౌక్‌ లో అయితే కేసీఆర్‌ తో సహా అందరం గొంతు విప్పారో ఆ ధర్నాచౌక్‌ నే నిషేధించడం విస్మ‌యం క‌లిగించింది. ఉద్యోగాల భ‌ర్తీలో యువ‌త నుంచి అసంతృప్తులు వ్య‌క్త‌మవుతున్నాయ‌నేది కాద‌న‌లేని నిజం.

కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ఇప్పటి దాకా వివక్ష - విద్రోహాలతో విధ్వంసమైన అణగారిన తెలంగాణ సస్యశ్యామల మైన - సంక్షేమప్రదమైన - శ్రేయోదాయకమైన రాజకీయ అవినీతిలేని తెలంగాణగా మార్చాలన్న తపనకు, ఆచరణకు మధ్య వ్యత్యాసం సుస్పష్టంగా ఉంద‌ని మేధావులు చెప్తున్న మాట‌. కేంద్రీకృతమైన రాజకీయ అవినీతి - విశృంఖలమైన పరిపాలనా అవినీతిపై ప్రజలు కథలుగా చెప్పుకుంటున్న తీరు సహజంగానే అందరికీ ఆందోళన కలిగిస్తోంది. చట్టబద్ధమైన పాలన - పౌరహక్కుల రక్షణ - భావ ప్రకటనా స్వేచ్ఛ - రాజకీయ విశ్వాసాల వెల్లడిని గౌరవిస్తామని చేసిన ప్రతిజ్ఞలు నీటి మీద రాతలుగా నిలిచాయి. తెలంగాణ పూర్వ వైభవ పునాదుల మీద నిలబడి, ప్రజల దృక్ఫథంతో, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి క్రమం కొనసాగాలన్నది అందరి ఆకాంక్ష. స్వ‌రాష్ట్ర ఫ‌లాలు స‌బ్బండ వ‌ర్గాల‌కు అందుతున్నాయా లేదా విప‌క్షాలు అంటున్న‌ట్లుగా `స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతం`గా స‌ర్కారు మారిందా అనేది కేసీఆర్ ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన మాట‌. ప‌రిశీల‌కులు తేల్చాల్సిన విశ్లేష‌ణ‌.

అయితే... ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే కేసీఆర్ పాల‌నలో ఊహించ‌ని ప‌రిణామాలు కూడా కొన్ని జ‌రిగాయి. చాలా మంది తెలంగాణ ఏర్ప‌డితే ఆంధ్రులు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతార‌ని, త‌ర‌చూ వివ‌క్ష దాడులు జ‌రిగే అవ‌కాశం ఉండొచ్చ‌ని..తెలంగాణ ముఖ్యంగా హైద‌రాబాదు వ‌దిలిపోవ‌ల‌సి వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డిన వారి సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. కానీ కేసీఆర్ ఆంధ్రుల్లో ఆ భ‌యాన్ని విజ‌య‌వంతంగా పోగొట్ట‌గ‌లిగారు. పైగా ఆంధ్ర‌లో కూడా అభిమానుల‌ను సంపాదించుకోలిగారు. ఆయ‌న వార‌సుడిగా కేటీఆర్ చాలా ముంద‌డుగు వేసి... పేరు సంపాదించాడు. కేటీఆర్‌-హ‌రీష్ మ‌ధ్య రాజ‌కీయ పోరు క‌నుమ‌రుగైంది. తెలంగాణ‌లో కోట్ల మందికి తీర‌ని క‌ల‌లా మిగిలిన ఇంటింటికీ నీరు... క‌చ్చితంగా నెర‌వేరే దిశ‌గా చాలా వేగ‌మైన అడుగులు ప‌డుతున్నాయి. ప‌రిశ్ర‌మ‌ల అనుమ‌తులు కూడా వేగంగా వ‌స్తున్నాయి. అధికారుల్లో అవినీతి పోలేదు గాని భ‌యం మాత్రం పెరిగి ప‌నులు అవుతున్నాయి. మిష‌న్ కాక‌తీయ చాలా చోట్ల ఫ‌లితాల‌నిచ్చింది. అన్ని ర‌కాల ఉద్యోగుల‌కు జీతాలు పెంచి ఉద్యోగ వ‌ర్గాల‌ను విప‌రీతంగా సంతోష‌పెట్టాడు కేసీఆర్‌. వారు మాత్రం వంద శాతం సంతృప్తి చెందారు. కొన్ని ప‌థ‌కాలు ఓట‌రు వ‌ర్గాల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. రాష్ట్రానికి అప్పులు పెరిగినా... వ్య‌తిరేక‌త‌ను మాత్రం విప‌రీతంగా త‌గ్గించుకోల‌గ‌డంలో కేసీఆర్‌ స‌క్సెస్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే కేసీఆర్‌ పై సానుకూల‌తే క‌నిపిస్తుంది. కాక‌పోతే ఇది గ్రామాల్లో కొంచెం త‌క్కువ‌గా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/