Begin typing your search above and press return to search.

డబ్బులు విసరండి ఓటర్లను కొనేయండిః వైరా ఎమ్మెల్యే రాములు నాయ‌క్

By:  Tupaki Desk   |   13 March 2021 11:37 AM GMT
డబ్బులు విసరండి ఓటర్లను కొనేయండిః వైరా ఎమ్మెల్యే రాములు నాయ‌క్
X
''ఓట‌రు లిస్టు ద‌గ్గ‌ర పెట్టుకోండి.. ఓట‌ర్ల‌ను ఏ, బీ, సీ, డీ వ‌ర్గాలుగా విభజించండి.. 'ఏ' అంటే మనోడు.. బీ అంటే ప్రత్యర్థి పార్టీవాడు.. ఇలా అందరినీ లిస్టు ఔట్ చేయండి. వీరిలో మనకు ఓటు వేయని వారికి డబ్బులు పంచండి. భయమేం లేదు..'' అని ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాములు నాయక్ వ్యాఖ్యానించార‌ట‌. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఈ ఆదివారం జ‌ర‌గ‌బోయే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు వెలుగులోకి రావ‌డంతో సంచ‌ల‌నంగా మారింది.

పోలింగ్ కు రెండు రోజులే గ‌డువు ఉండ‌డంతో.. టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల‌తో రాములు నాయ‌క్ స‌మావేశ మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా పై విధంగా వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఏం చేసైనా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపు సాధించాల‌ని కార్య‌క‌ర్త‌లతో చెప్పార‌ట రాములు నాయ‌క్‌.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప‌రిస్థితి గ‌తంలో మాదిరి లేక‌పోవ‌డం.. దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌వ‌డంతో.. గులాబీ ద‌ళం ఎన్న‌డూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో.. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి, త‌మ బ‌లం త‌గ్గ‌లేద‌ని నిరూపించాల‌ని తాప‌త్ర‌య ప‌డుతోంది. అదే స‌మ‌యంలో బీజేపీది బ‌లుపు కాదు.. వాపు మాత్ర‌మేన‌ని చాటిచెప్పాలంటే కూడా ఈ గెలుపు అనివార్య‌మైంది.

దీంతో.. ఏం చేసైనా విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది అధికార పార్టీ. అయితే.. ప‌రిస్థితి కూడా అంత ఆశాజ‌న‌కంగా లేదు. ఇవి నిరుద్యోగ‌, యువ‌త‌కు సంబంధించిన ఓట్లు కావ‌డంతో.. ఈ రెండేళ్ల‌లో ప్ర‌భుత్వ ప‌నితీరును బ‌ట్టి వారు ఓటు వేసేందుకు అవ‌కాశం ఉంది. ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యంలో యువ‌త‌లో కొంత వ్య‌తిరేక‌త ఉన్న విష‌యం తెలిసిందే.

అయిన‌ప్ప‌టికీ.. గెలుపు జెండా ఎగ‌రేయాల‌ని ఆదేశాలు జారీచేసిందట అధిష్టానం. దీంతో.. క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ చాలా సీరియ‌స్ గా ప‌నిచేస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో వైరా ఎమ్మెల్యే డ‌బ్బులు పంచి ఓట్లు కొనండి అని వ్యాఖ్యానించిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం వైర‌ల్ గా మారింది.