Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు కోపం తెప్పించిన నిరసన

By:  Tupaki Desk   |   6 July 2021 11:30 PM GMT
కేటీఆర్ కు కోపం తెప్పించిన నిరసన
X
దేశంలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ప్రభుత్వాలైనా.. మనుషులైనా సరే మనకు మనల్ని ప్రొటెస్ట్ చేసే హక్కులను రాజ్యాంగం కల్పించింది. అయితే హద్దులు మీరనంతవరకు నిరసనలకు ఓకే.. కానీ అదే హద్దు దాటితే ఏంటి పరిస్థితి.?

అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికోసారి పెట్రోల్, డీజీల్ ధరలు పెంచితే ఎడ్ల బండ్లు, గాడిదలపై ఊరేగుతూ నిరసన తెలిపారు. కానీ ఇప్పుడు ఘనత వహించిన మన మోడీ సర్కార్ రోజూ పెట్రో ధరలు పెంచితే విసిగి వేసారి ఇక చేష్టలుడిగి చూస్తున్నామన్న ఆవేదన ప్రజల్లో ఉంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ఏ నిర్ణయాలను అయినా సరే వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉంది. వారు నిరసనలు, ఆందోళనలు చేయడం సర్వసాధారణం. ప్రభుత్వాలు దీనిపై పునరాలోచించి నిర్ణయాలు వెనక్కి తీసుకున్న సందర్భాలున్నాయి.

అయితే తాజాగా కొందరు చేస్తున్న నిరసనలు కూడా విమర్శల పాలవుతున్నాయి. కొందరు ఫోటోలు, మీడియా ఫోకస్ చేసిన వినూత్న ఆందోళన ఇప్పుడు నవ్వుల పాలైంది. ప్రజాప్రతినిధులు సైతం ఇదేం నిరసన అంటూ తిట్టిపోస్తున్నారు.తాజాగా హైదరాబాద్ లో కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజీల్, వంటగ్యాస్ ధరలను పెంచినందుకు నిరసన చేపట్టారు. జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కొందరు మహిళలు ఆందోళన నిర్వహించారు.

ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రప్రభుత్వం రూ.25 పెంచిందని జాతీయ మహిళా సమాఖ్య నిరసనకు దిగింది. ఈ క్రమంలోనే కొందరు మహిళలు అత్యుత్సాహంతో ట్యాంక్ బండ్ చెరువులో గ్యాస్ సిలిండర్ ను పడేశారు. ఇక కొందరు నిరసనకారులు పెట్రోల్ రేట్లు పెరగడానికి నిరసనగా బైక్ ను కూడా చెరువులో పడేశారు.

ఈ ఫొటోలను ట్వీట్ చేస్తూ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. చెరువులో ఇలాంటివి వేయకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీలను కోరారు. చెరువుల్లో బైక్స్, సిలిండర్లు వేయడం బాధ్యతారాహిత్యమని మంత్రి ట్విట్టర్ లో విమర్శించారు. ఉపయోగపడే వస్తువులు వృథాగా ఎందుకు పడేస్తున్నారంటూ నిరసనకు హద్దులు ఉండాలని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.