Begin typing your search above and press return to search.

వాట్సాప్ గ్రూపు నుంచి తీసేశారని రాజీనామా చేస్తాననన్న ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   28 May 2019 1:22 PM GMT
వాట్సాప్ గ్రూపు నుంచి తీసేశారని రాజీనామా చేస్తాననన్న ఎమ్మెల్యే
X
పేరుకు ఆమ్ ఆద్మీ పార్టీ అయినా అక్కడా నియంతృత్వమే అంటారు ఆ పార్టీలోని కొందరు నేతలు. తాజాగా లోక్ సభ ఎన్నికల్లో దిల్లీలోని 7 సీట్లకు 7 సీట్లలోనూ ఓడిపోయిన ఆ పార్టీ అందుకు కారణాలపై సమీక్షించుకుంది. ఆ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఓటమికి అందరిదీ బాధ్యతని చెప్పారట. అలా ఎలా కుదురుతుందని ప్రశ్నించిన ఓ ఎమ్మెల్యేను పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశారంట. దీంతో ఆ ఎమ్మెల్యే కూడా అంతే సీరియస్‌ గా స్పందించి.. తన అయిదేళ్ల పదవీ కాలం పూర్తికాగానే ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

దిల్లీలోని 7 స్థానాల్లో ఆప్ ఓటమిపై సమీక్షించుకుంటున్నప్పుడు అందరిదీ బాధ్యతే అని కేజ్రేవాల్ అనగా.. చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబా అందుకు అభ్యంతరం చెప్పారు. అన్ని నిర్ణయాలు తీసుకున్నవారే(కేజ్రీవాలే) ఓటమికి బాధ్యత వహించాలని సూచించారు. తన నియోజకవర్గం చాందినీ చౌక్‌ లో ఆప్‌ కు ప్రజలనుంచి మద్దతు లభించిందని.. అలాంటప్పుడు ఓటమికి తానెందుకు బాధ్యత వహించాలని ఆమె ప్రశ్నించారు. దీంతో కేజ్రీవాల్ - ఆయన అనుచరులు ఆగ్రహించి ఆప్ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్ గ్రూప్ లోంచి ఆమెను తొలగించారు. దీంతో ఆమె ప్రశ్నిస్తే తప్పా అంటూ సీరియస్ అయ్యారు. పార్టీ తనను వెళ్లగొట్టాలని చూసినా - ఎమ్మెల్యే టర్మ్ ముగిసేంత వరకూ అందులోనే కొనసాగుతానని చెప్పారు. అయిదేళ్ల కాలం పూర్తవగానే రాజీనామా చేసేస్తానని ప్రకటించారు.

కాగా కొంతకాలంగా అధిష్టానంతో విబేధిస్తూ వస్తున్న ఆమెను పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాగే చేశఆరు. గతేడాది డిసెంబర్ లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి భారతరత్నను రద్దు చేయాలన్న ఆప్ తీర్మానాన్నిఅల్కా వ్యతిరేకించినందుకు ఆమెను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీకోసం ప్రచారం చేస్తారనే ఉద్దేశంతో మళ్లీ యాడ్ చేశారు. కానీ కేజ్రీవాల్ రోడ్ షోలో పాల్గొనేందుకు అల్కా నిరాకరించారు.