Begin typing your search above and press return to search.

తుమ్మలతో టీఆర్‌ఎస్‌కు ఒరిగేదేంటో తెలిసిపోతుందా!

By:  Tupaki Desk   |   20 March 2015 4:57 AM GMT
తుమ్మలతో టీఆర్‌ఎస్‌కు ఒరిగేదేంటో తెలిసిపోతుందా!
X
తుమ్మల నాగేశ్వరరావును తెలంగాణ రాష్ట్ర సమితి వారు తెలుగుదేశం నుంచి తెచ్చుకొన్నారు. మంత్రి పదవి.. ఎమ్మెల్సీ పదవులతో ఆయనను సత్కరించుకొన్నారు. ఆయన తెలంగాణ వాది కాదు.. తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఎన్నికల ముందు ఒక్క రోజు కూడా పనిచేసిన వ్యక్తి కాదు. అయినా కూడా ఆయనకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మంచి అవకాశాలు దక్కాయి. ఈ విషయంలో తెరాస నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారిని పట్టించుకోలేదు.

మరి అలా తెచ్చుకొన్న తుమ్మల నాగేశ్వరరావుతో ఉపయోగం ఎంతో ఇప్పుడు తెలిసిపోతుందా? ఆయన చేరికతో తెలంగాణ రాష్ట్ర సమితికి కలిగే లబ్ధి ఎంతో అర్థం అవుతుందా? అవుననే అంటున్నారు కొంతమంది గులాబీ చొక్కాలు.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న గ్రాడ్యుయేట్ల నియోజకవర్గపు ఎన్నికల్లో ఖమ్మం జనాలు కూడా ఓటేయాల్సి ఉంది. నల్లగొండ జిల్లాతో కలిసిన నియోజకవర్గంలో ఖమ్మం ఉంది. ఇక్కడ ఓటు నమోదు చేయించుకొన్న గ్రాడ్యుయేట్లు తమ తీర్పును ఇవ్వాల్సి ఉంది.

మరి ఇప్పుడు ఈ నియోజకవర్గ పరిధిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కచ్చితంగా గెలవాల్సి ఉంది. తెలంగాణ సాధన పార్టీ ఇమేజ్‌, అధికార పార్టీ హోదా.. వంటి అంశాలు తెలంగాణకు ప్లస్‌ పాయింట్లు.

దానికి తోడు తుమ్మల చేరికతో ఖమ్మం జిల్లాలో కూడా పార్టీ బలోపేతం అయ్యుండాలి. కాబట్టి ఈ నియోజకవర్గ పరిధిలో తెలంగాణ రాష్ట్ర సమితి కచ్చితంగా గెలవాలి! ఒక విధంగా తుమ్మలకు ఇది పెద్ద పరీక్షే!

మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఈ నియోజకవర్గం మీద చాలా ఆశలు పెట్టుకొంది. కేంద్ర మంత్రులు కూడా ప్రచారంలోకి తమ అభ్యర్థిని గెలిపించమని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మరి పోరాటంలో విజయం ఎవరిదో!