Begin typing your search above and press return to search.

30 ఏళ్ల పగ వదిలేసిన ఆ నేతలు..కారణమిదే!

By:  Tupaki Desk   |   2 Sep 2018 9:54 AM GMT
30 ఏళ్ల పగ వదిలేసిన ఆ నేతలు..కారణమిదే!
X
30 ఏళ్లుగా ఆ రెండు కుటుంబాల మధ్య వైరం వర్ధిల్లుతోంది. కానీ వారిద్దరూ ఓకేపార్టీలో చేరడంతో పగలు, ప్రతీకారాలు సమసిపోయాయి. మధ్యలో ఏం జరిగింది..? ఆ నేతలు ఎందుకు కలిసిపోయారు.. ఇంతకీ ఎవరా నేతలు అనేది తెలుసుకుందాం..

ఖమ్మం రాజకీయాల ప్రస్తావన రాగానే మొదట గుర్తుకు వచ్చేది రెండు కుటుంబాలే.. ఒకటి జలగం ఫ్యామిలీ అయితే.. రెండోది తుమ్మల ఫ్యామిలీ.. ఈ రెండు కుటుంబాలు ఖమ్మం రాజకీయాలను ఆది నుంచి శాసించాయి. వీరిమధ్య 30 ఏళ్లుగా పొలిటికల్ వార్ నడుస్తోంది. జిల్లా రాజకీయాల్లో ఆదిపత్యం కొనసాగించడానికి సాగుతున్న ఈ సమరం ఒక్కసారిగా ఆగిపోయిందట..ఇప్పుడు ఈ కోణమే జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందట..

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం జిల్లా రాజకీయాల్లోనే అత్యంత కీలకంగా ఉండేది. జలగం ఫ్యామిలీ ఇక్కడి నుంచే చక్రం తిప్పేది. జలగం వెంగళరావు ఉమ్మడి ఏపీకి సీఎంగా కూడా పనిచేశారు.ఆయన కుమారుడు జలగం ప్రసాద్ రావు మంత్రిగా కూడా పనిచేశాడు. జలగం మరో కుమారుడు కూడా సత్తుపల్లి నుంచే ఎంట్రీ ఇచ్చాడు. ఇక జలగం ఫ్యామిలీతో సై అంటే సై అనే తుమ్మల నాగేశ్వరరావు కూడా రాజకీయ అరంగేట్రం చేసింది సత్తుపల్లి నుంచే.. జలగం వర్సెస్ తుమ్మల ఎపిసోడ్ జిల్లా రాజకీయాల్లోనే కొనసాగుతూనే ఉండేది..

జలగం ఫ్యామిలీ కాంగ్రెస్ నుంచి.. తుమ్మల ఫ్యామిలీ టీడీపీ నుంచి ఆదిపత్య పోరు సాగిస్తూనే ఉండేవారు.. అయితే ఎప్పుడైతే సత్తుపల్లి ఎస్సీ రిజర్వు అయ్యిందో అప్పటి నుంచి వీరిద్దరూ ఖమ్మం కేంద్రంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వచ్చారు. గత ఎన్నికలకు ముందు జలగం వెంకట్రావ్ టీఆర్ఎస్ లో చేరారు. కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గడిచిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా గులాబీ కండువా వేసుకున్నారు. మంత్రి కూడా అయ్యారు. అయినా కూడా వీరిద్దరి మధ్య స్నేహగీతం పాడలేదు. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు జిల్లాపై ఆదిపత్యం కోసం పోరు సల్పారు. కానీ హఠాత్తుగా సీన్ మారిపోయిందట.. 30 ఏళ్ల పగను పక్కనపెట్టి జలగం, తుమ్మల ఫ్యామిలీ దోస్త్ మేరా దోస్త్ అంటున్నాయట.. ఈ పరిణామం టీఆర్ఎస్ లో ఫుల్ జోష్ తేగా.. ప్రతిపక్షంలో మాత్రం కంగారు మొదలైంది..

అయితే 30 ఏళ్ల పగను వీరు ఎందుకు పక్కపెట్టారన్నది హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం జోక్యంతో అని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నా.. జిల్లాపై ఆదిపత్యం కోసం తామిద్దరం కొట్టుకుంటే వేరొకరి చాన్స్ దక్కుతుందనే ఉద్దేశంతోనే కలిసిపోయినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం ఎంపీ పొంగులేటి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఇద్దరూ బలమైన నేతలు ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారని జలగం, తుమ్మల ఫ్యామిలీలు గ్రహించాయి. దీంతో వారిద్దరికి చాన్స్ ఇవ్వవద్దనే ఖమ్మం జిల్లాను తుమ్మల, భద్రాద్రి జిల్లాను జలగం ఫ్యామిలీ తీసుకోవాలని ఓ ఒప్పందానికి వచ్చినట్టు తెలిసింది. కారణాలు ఏవైనా దశాబ్ధాల వైరాన్ని రెండు కుటుంబాలు పక్కన పెట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.