Begin typing your search above and press return to search.

టైగర్ టీఎన్ శేషన్ ఇక లేరు

By:  Tupaki Desk   |   11 Nov 2019 5:09 AM GMT
టైగర్ టీఎన్ శేషన్ ఇక లేరు
X
చట్టాలు ఎంత కఠినం గా ఉన్నా.. వాటిని అమలు చేసే వారిలో దమ్ము లేక పోతే ఏమీ చేయలేని పరిస్థితి. చట్టాన్ని సరైన రీతిలో నడిపిస్తే.. ఎన్నికలు ఎలా నిర్వహించొచ్చన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు టైగర్ టీఎన్ శేషన్. భారత ఎన్నికల స్వరూపాన్ని మార్చేయటమే కాదు.. కేంద్ర ఎన్నికల కమిషన్ అంటే వణికే లా చేయటం లో ఆయన సక్సెస్ అయ్యారు. ఎన్నికల సంస్కర్త గా ప్రసిద్ధి పొందిన కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి టీఎన్ శేషన్ (87) గుండె పోటుతో తుది శ్వాస విడిచారు.

కేరళ లోని పాలక్కాడ్ జిల్లా లో 1932లో జన్మించిన శేషన్ .. తాను పుట్టిన ఊరి లోనూ ప్రాధమిక విద్య ను అభ్యసించారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ లో గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హార్వర్డ్ వర్సిటీ లో ఉన్నత విద్యను అభ్యసించారు. ముక్కు సూటిగా వ్యవహరించే టీఎన్ శేషన్.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన దేశవ్యాప్తం గా సుపరిచిత మయ్యారు.

1990-96 మధ్యన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తన పదవీ కాలంలో ఎన్నికల్లో భారీగా సంస్కరణలు చేపట్టారు. అప్పటివరకూ సాగుతున్న ఎన్నికల తంతును సమూలం గా మార్చేయటమే కాదు.. ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డుల్ని తీసుకొచ్చారు.

ప్రచార వేళలు కుదింపు తో పాటు.. ఎన్నికల ఖర్చు విషయం లో డేగ కన్ను వేయటం తో పాటు.. ఇష్టా రాజ్యంగా వ్యవహరించే రాజకీయ పార్టీల కు షాకుల మీద షాకులు ఇవ్వటం ద్వారా ఈసీ అంటే భయంతో కూడిన భక్తి కలిగేలా చేయటంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఎన్నికల వ్యయం నియంత్రణ వంటి సంస్కరణల్ని తీసుకురావటంలో విజయవంతమైన ఆయన.. 1989లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి గా సేవలు అందించారు. 1996లో ఆయన రామన్ మెగసెసే అవార్డు ను సైతం అందుకున్నారు.

ఎన్నికల నిబంధనల్ని కఠినంగా అమలు చేయటం అన్న మాటకు నిలువెత్తు రూపంలా నిలిచిన టీఎన్ శేషన్ తర్వాత ఇప్పటి వరకూ ఆ స్థాయి లో ఉన్నఎన్నికల ప్రధానాధికారి మరొకరు రాలేదని చెప్పక తప్పదు. ఎన్నికల ప్రధానాధికారి పదవికి గ్లామర్ తీసుకు రావటమే కాదు.. ఎన్నికల నిర్వహణ విషయం లోనూ పెను మార్పుల కు కారణంగా టీఎన్ శేషన్ గా చెప్పక తప్పదు. రాజకీయ పార్టీల కు సింహ స్వప్నంగా నిలిచి.. టైగర్ అన్న ముద్దు పేరును ప్రజల చేత పిలిపించుకున్న ఘనత శేషన్ కు మాత్రమే దక్కుతుందనటం లో సందేహం లేదు.